జర్నలిజంలో ఓ ప్రాథమిక నియమం… జుగుప్సాకరమైన దృశ్యాలు చూపించరాదని.
ఒళ్లు గగుర్పొడిచే భయానకమైన చిత్రాల సారాన్ని అక్షరాలతో మాత్రమే ఆవిష్కరించాలని.
వెగటు పుట్టించే, అసహ్యం కలిగించే, అసభ్యకరమైన అనాచ్ఛాదిత దృశ్యాలను ‘బహిరంగం’ చేయరాదని. అయితే అదే జర్నలిజం ప్రాథమిక సూత్రాల్లోనే ఒక చిత్రం వేల మాటలతో సమానం అన్న మాట కూడా ఉంది.
సెప్టెంబర్ 15న మేడారం అడవుల్లో జరిగిన ‘ఎన్ కౌంటర్’లో తంగెల్ల శ్రుతి, మనికంటి విద్యాసాగర్ రెడ్డి అనే ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. పోలీసులు వారి శవాల ఫొటోలు కూడా మీడియాద్వారా రిలీజ్ చేశారు. అయితే ఎన్ కౌంటర్లు జరగడం ఇవాళ కొత్తేమీ కాదు కాబట్టి అన్ని ఎన్ కౌంటర్లలాగే ఇది కూడా జరిగి ఉంటుందన్న సాధారణ అభిప్రాయం ఏర్పడింది. అఫ్ కోర్స్ చాలామందికి ఇదే అభిప్రాయం కలిగి ఉండవచ్చు కూడా. కానీ 17వ తేదీన పోస్టుమార్టమ్ జరిగిన సమయంలో ‘ఎన్ కౌంటర్’కు ముందు ఏదో జరిగిందన్న అనుమానాలు బయటికి పొక్కాయి. క్రమంగా ఆ అనుమానాలకు ఫొటోల రూపంలో ఆధారాలు కూడా బయటికొచ్చేశాయి. ఆ ఫొటోలు చూసిన ఎవరికైనా ఎన్ కౌంటర్ స్పెషలిస్టుల వికృతరూపం కళ్లముందు కదలాడక మానదు. మరి అలాంటి ఫొటోలు వేయాలా, వద్దా? వేస్తే ఏ ఫొటోలు వేయాలి?
ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు విడుదల చేసిన ఫొటోలు కరెక్టా? ఎన్ కౌంటర్ కు ముందేం జరిగిందో చెప్పే ఫొటోలు కరెక్టా?
ప్రచురణార్థం పోలీసులు ఇచ్చిన ఫొటోలు వాడాలా? శ్రుతి తల్లి తెగించి తీసిన ఫొటోలు వాడాలా?
శవాలకు నీటుగా ఆలివ్ గ్రీన్ దుస్తులు తొడిగించిన ఫొటోలు వాడాలా? దుస్తుల్లో అండర్ వేర్స్ అడుగున జరిగిన అమానవీయ, అసహ్యకరమైన రాక్షసానందపు చీకటిచర్యల గుర్తులు చూపాలా?
అందమైందాన్ని అందంగా చూపాలా? అసహ్యంగా చూపాలా?
అసహ్యమైందాన్ని అందంగా చూపాలా? అసహ్యంగా చూపాలా?
ఇక్కడో సంఘర్షణ.
సర్వజీవులు, సకల మానవ జాతులు చిగురించే సంయుగ్మస్థలిలో ఏ కిరాతక చర్య జరిగి ఉంటుందో చెప్పడం కన్నా ఆ నగ్నదృశ్యాన్ని చూపడమే కరెక్టేమో కదా.

ఫొటోలు చూశాక కలిగే అనుమానాలు
ఎన్ కౌంటర్ జరిగితే కాళ్ల మీద, చేతుల మీద, చేతి వేళ్ల మీద సూదులతో గుచ్చినట్టు గుంటలు ఎలా ఏర్పడతాయి?
ఎన్ కౌంటర్ జరిగితే శరీరం కాలిపోయినట్టు బొబ్బలెలా వస్తాయి?
గొంతు పిసికి, మెడలు విరిచినట్టుగా ఉన్న సాగర్ నిర్జీవ చిత్రాలు ఎన్ కౌంటర్ కథకు ఎలా పొసగుతాయి?
శ్రుతి చర్మం కాలిపోయి, లోపలిమాంసం ఉడికిపోయి తెల్లగా బయటపడ్డ శరీరభాగాలు ఎన్ కౌంటర్ కు ఎలా సపోర్ట్ చేస్తాయి?
శ్రుతి, సాగర్ ల మర్మాంగాల దగ్గర మాంసపు ముద్దలు వేలాడుతుండడటం, కత్తితో గాట్లు పెట్టినట్టుగా గాయాలు దేన్ని సూచిస్తున్నాయి?
శ్రుతి జననాంగం దగ్గర తెల్లని ద్రవం ఏమిటి?
శ్రుతి చేతుల మీద, నడుం దగ్గర గాట్లు ఎలా వచ్చాయి?
శ్రుతి నడుందగ్గర చర్మమంతా ఊడిపోయి తెల్లగా బయటపడడం ఎందువల్ల జరిగింది?
సాగర్ దవడలు ఎందుకని షేపవుట్ అయిపోయాయి? ఆయన ఎముకలు ఎలా విరిగాయి?
అన్నింటికన్నా శవాల దగ్గరకు వారి బంధువుల్ని కూడా అనుమతించకపోవడంలో ఆంతర్యమేంటి?

మేడారం ఎన్ కౌంటర్ సర్కారు అనుమతితోనే జరిగిందా?
పోలీసుల ప్రతిచర్యను ప్రభుత్వాలు ఆదేశించకపోయినా, వారి ప్రతిచర్యను కూడా ప్రభుత్వ చర్యగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే అంతిమంగా సర్కారే విధాన నిర్ణేత కాబట్టి. అయితే అధికార పీఠం కోసం ప్రజల మధ్య కుట్రలు, కుతంత్రాలు సృష్టించిన నిన్నమొన్నటి పాలకులు వేరు. బహుళ ప్రజాకాంక్షకు ప్రతిరూపంగా ఇటీవలే పగ్గాలు చేపట్టిన కేసీఆర్ నేపథ్యం వేరు. భావి తెలంగాణకు పునాదులు వేయబూనిన ఒక నమూనా రూపశిల్పి ఆయన. అలాంటి వ్యక్తి పాలనలో నరరూప రాక్షసత్వం జడలువిప్పడమే మింగుడుపడని అంశం. ఎన్ కౌంటర్ అనేది పలు పరిస్థితుల అల్లికలో జరిగే ఓ ఘటనాత్మక చర్య. నిర్బంధించి తీసుకెళ్లి, పిడిగుద్దులు గుద్ది, ఎముకలు విరిచి, యాసిడ్ పోసి, ఒంట్లోని ఒక్కొక్క అవయవాన్ని వంతులవారీగా నిర్జీవం చేయడం ప్రేరణాత్మక చర్య. మరి ఆ ప్రేరక శక్తి ఎవరు? మేడారంలో యాక్షన్ చేసిన ఖాకీలు స్వయం చోదక శక్తులా? ఆదేశాలు మాత్రమే అమలు చేసే జవాన్లా? ఏమైనా ఎదురుకాల్పుల మిషతో తప్పించుకు తిరిగే తోడేళ్ల (గ్రేహౌండ్స్) గుంపు… రేపటిరోజుల్లో ప్రజావళి తరఫున ప్రశ్నించదలచుకున్న ఎందరికో ప్రమాదం. అది కూడా ముళ్లదారిలో నడిచి, కాలపరీక్షలో నెగ్గి నూతన తెలంగాణ స్వప్న ఆవిష్కారం వైపు రాజీ లేకుండా ప్రయాణిస్తున్న అవిశ్రాంత బాటసారి కేసీఆర్ హయాంలోనైనా పైప్రశ్నలకు జవాబులు ఆశించడం తప్పుకాదేమో.

ఎందుకంటే..
ఓ పాలకుడా?
నీ మౌనం అర్థంగీకారమో, అనంగీకారమో తెలియకున్నది.
ఎందుకంటే..
ఉద్యమ సమయంలో నువ్వు చాలా సందర్భాల్లో అనేవాడివి. నువ్వు మర్చిపోయావని కాదు, మాకు గుర్తున్నది చెప్తున్నాం.
ఏమంటే.. “ఎవలొచ్చిండ్రు వెయ్యేండ్లు బత్కనీకె.”
రెండు మాటల్లో జీవిత పరమార్థాన్ని చెప్పిన నువ్వు, ఆ మధ్య సవతితల్లి రాక్షసత్వానికి విలవిల్లాడిన ప్రత్యూషను ఇంటికి పిలిచి బువ్వపెట్టి జీవితానికి భరోసా ఇచ్చావు. అంతటి నీ ఔదార్యం అలాంటి మరో యువతిని అమానుషంగా బలి కోరుతుందంటే ఎలా నమ్మడం?
స్వరాష్ట్ర ఆశయం కోసం శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నప్పుడు గన్ పార్కులో వలవలా ఏడ్చిన నీ పసిహృదయం అంతే వయసున్న సాగర్ ను, సాగర్ ఆశయాన్ని సమాధి చేయగోరుతుందా?
మొన్న కరీంనగర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో నీ ప్రసంగానికి ఓ రైతు అడ్డు తగిలినప్పుడు “హుస్నాబాద, సిద్దిపేట బాద, సిరిసిల్ల బాద, నీ బాద, నా బాద, మన అందరి బాదలు నాయే”నని అన్నవు గదా. అలాంటి నువ్వు శ్రుతి, సాగర్ల బాదేందో అర్థం చేసుకోలేని వ్యక్తివి కాదు గదా.

అందుకే ఓ పాలకుడా..
మించిపోయింది లేదు. ఏదైతే అదైంది. న్యాయ విచారణకు ఆదేశించు. మేడారం ఘటనలో అసలేం జరిగిందో ప్రపంచానికి చాటు. అమానవీయ ఘటనలకు అధికారంతో ప్రమేయం లేదని నిరూపించు. ప్రభుత్వ పాలనలోనే కాదు, ప్రజాభిప్రాయ పరిరక్షణలోనూ తెలంగాణను రోల్ మోడల్ గా నిలబెట్టు. కేసీఆర్ ఎప్పుడూ మల్లెపువ్వు లాంటి మనిషేనని సామాన్యజనం చాటుకోనీ.
దీనివల్ల పోయేదేముంది? మహా అయితే తోడేళ్లలో మృగవినోదం కనుమరుగై మానవీయ బాధ్యతలు పొటమరిస్తాయి. అంతేకదా.

మైదాన ప్రాంతాల్లో ఊళ్లు దత్తత తీసుకోవడానికి ఎవరో ఒకరున్నారు. కానీ శ్రుతి, సాగర్, వివేక్ లాంటి యువకిశోరాలు ఆదివాసుల గూడేలను దత్తత తీసుకున్నారు. ఏం చేస్తారు వాళ్లు? ఏమవుతుంది వాళ్లతో? మహా అయితే సమాజంలో

IMG_20150916_170413F-p1a138qik29tnk6l13jsd7107q
సాగర్ మర్మాంగం వద్ద గాయం
IMG_20150916_160619 - Copy-p1a138qikd1nod1kek19739a41i4l
శ్రుతి శరీరంపై యాసిడ్ పోసినట్టుగా కాలి బొబ్బలెక్కిన గుర్తులు
IMG_20150916_170606-p1a138qikdb8u1ej0od8nv419ml
సాగర్ చేతివేళ్లపై సూదులతో గుచ్చినట్టున్న దృశ్యాలు
IMG-20150923-WA0024
ఎన్ కౌంటర్ తరువాత విద్యాసాగర్ రెడ్డి మృతదేహం
IMG-20150923-WA0025
ఎన్ కౌంటర్ తరువాత శ్రుతి మృతదేహం

జడత్వం ఆవహించకుండా ప్రయత్నిస్తారు. అంతేకదా. వాళ్లేమీ మనను ప్రమోట్ చేయమనడం లేదు. మనం కూడా వాళ్లను ప్రమోట్ చేయనక్కర్లేదు. కనీసం వారిని ప్రాణాలతో ఉంచుదాం. ఏమంటావ్?

ఎందుకంటే…
ఎవలొచ్చిండ్రు వెయ్యేండ్లు బత్కనీకె.

Advertisements

2 thoughts on “మేడారంలో ఎన్ కౌంటర్ మాత్రమే జరిగిందా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s