ప్రాచీన భారత సమాజం నుంచీ వస్తున్న కొన్ని ఆహార అలవాట్లు ఎప్పుడూ చర్చలో భాగంగానే ఉంటూ వస్తున్నాయి. అలాంటి చర్చల్లో బీఫ్ మరోసారి తాజా చర్చనీయాంశంగా మారింది. బీఫ్ అంటే పశుమాంసం. ఆ పశుమాంసం కిందికి ఆవు, ఎద్దు, గేదె, దున్న వగైరా జంతువులు వస్తాయి. బీఫ్ ను తినేవాళ్లు తింటున్నారు. తి ననివాళ్లు దూరంగా ఉంటున్నారు. వీరికి ఎలాంటి ప్రచారాలతో పన్లేదు. కానీ బీఫ్ ను వ్యతిరేకించేవారు, సమర్థించేవారితోనే ఈ అంశం ఎప్పుడూ వివాదాస్పదమవుతోంది. మీడియా హెడ్ లైన్స్ లోకి ఎక్కుతోంది. ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తటస్థంగా ఉండేవారిని కూడా ఎంతోకొంత ప్రభావితం చేస్తోంది. అయితే బీఫ్ ను తినొచ్చా, తినకూడదా అన్నది చర్చించి ప్రయోజనం లేదు. ఎందుకంటే తినొచ్చు అనిగానీ, తినకూడదు అనిగానీ చెప్పే అధికారం ఎవరికీ లేదు. ఫలానా ఆహారం మాత్రమే తినాలనే ఆంక్షలు ఎవరికీ ఆమోదయోగ్యం కావు. కాబట్టి ఈ వ్యాసంలో బీఫ్ ను తినొచ్చా, తినకూడదా నిర్ణయించుకునే అవకాశాన్ని పాఠకుడికే వదిలేస్తూ బీఫ్ చుట్టూ అల్లుకున్న ఆర్థిక, సామాజిక కోణాలను స్పృశించడం వరకే పరిమితమవుదాం.


బీఫ్ తినడం ఎలా మొదలైంది?
బీఫ్ తినడం ఇవాళ కొత్త అలవాటు కాదు. ఆ మాటకొస్తే మానవ ప్రస్థానం వేటగాడిగా మొదలైనప్పుడు మనిషి ముందుగా మంసాహారిగానే ఉన్నాడు. తొలుత ఒక్క గోవుల్ని మాత్రమే ఎంచుకొని వధించి తిని బతకలేదు. చేతికి చిక్కిన జంతువుతో పోరాడి, దాన్ని లొంగదీసుకొని ఆకలి తీర్చుకుంటూ వచ్చాడు. ఈ పోరాటంలో చాలాసార్లు ప్రాణాలు కోల్పోయాడు. అలా ప్రమాదకరమైన జంతువులేవో తెలిసివచ్చింది. తాను బతకాలంటే వేటాడాల్సింది ప్రమాదకరమైన జంతువుల్ని కాదు… సాధు స్వభావమున్న జంతువులను అని అర్థం చేసుకున్నాడు. జీవితం నేర్పిన ఈ పాఠాల నుంచి ప్రమాదకరమైన జంతువులు, సాధు జంతువులన్న వర్గీకరణ ఏర్పడింది. ప్రమాదకరమైనవాటికి దూరంగా ఉంటూ సాధు జంతువులను మచ్చిక చేసుకొని తనకు స్నేహితులుగా మలచుకున్నాడు. పశుపోషణలో ఉన్న లాభాలేంటో తెలుసుకున్నాడు. పశుసంపదను గణనీయంగా వృద్ధి చేశాడు. అలా భారతీయుడు గోపాలుడయ్యాడు. సామాజిక ఆర్థిక పరిపుష్టిలో పశుసంపద కీలకంగా మారిపోయింది. వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు. వ్యవసాయం కోసం జంతువుల సాయం తీసుకున్నాడు. ఈ దశకు చేరుకునేనాటికే మనిషికి శాకాహారం అలవడింది. శాకాహారంలో ఉండే సౌలభ్యమేంటో తెలిసొచ్చింది. అటు వ్యవసాయానికి పశుసంపద ఎంత అవసరమో కూడా గ్రహించాడు. అయితే అప్పటికే కర్మకాండలు, జంతుబలులు, యాగాలు మానవ జీవితాన్ని పెనవేసుకుపోయాయి. అశ్వమేధ యాగం, గోమేధ యాగం వంటి క్రతువులు విపరీతంగా జరిగాయి. గోపాలకుడే గోమాంస భక్షణం కూడా చేశాడు. భారతీయ పురాణేతిహాసాల్లో ఉన్న అనేక ఉటంకింపుల్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆనాటి సమాజంలో గోమాంసం నిత్యావసర సరుకుగా ఉండేది. ఇంటికి వచ్చిన అతిథికి గోమాంసం పెట్టకపోతే అమర్యాదగా జమ కట్టబడేది. ఒక్క గోమాంసమే కాదు… అతిథి సంతుష్టీకరణ కోసం ఆనాటి మన బ్రాహ్మణ శిష్ట సమాజం అనేక అడుగులు ముందుకెళ్లిపోయింది. వాటిని ప్రస్తావించడం ఇక్కడ అనవసరం. అతిథి దేవుళ్ల కోసం చేసిన త్యాగాల ముందు గోమాంస విందు భోజనం పెద్ద లెక్కలోది కాదు. అదలా ఉంచుదాం. అయితే కాలక్రమంలో మానవ నేస్తాలైన జంతువుల్ని విచక్షణరహితంగా బలివ్వడం వల్ల భవిష్యత్తులో చిక్కులు రావచ్చని గ్రహించాడు. వేదాల్లో జంతుబలుల గురించి చెప్పిన మనిషే…. ఉపనిషత్తుల కాలానికి భూతదయ చూపాల్సిన అవసరాన్ని గుర్తించాడు. ఆనాడు గోమేధయాగాలు చేసిన మనిషి ఆ తరువాత గోవును తల్లిగా పూజించాడు. గోమాతగా ప్రతిష్టించుకున్నాడు. అయితే మిగతా జంతువులకు ఆ స్థానం ఇవ్వలేదు. కాలప్రవాహంలో జరిగిన సాంస్కృతిక పరిణామంగానే దీన్ని చూడాలి.
వివాదం ఎక్కడ నుంచి వస్తోంది?
బీఫ్ తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నవారు గోమాంసం విషయంలో మాత్రమే పట్టుబడుతున్నారు. బఫెలో మీట్ విషయంలో వారికెలాంటి పట్టింపులూ లేవు. ఒక్క ఆవును మాత్రం వదిలేయండి. మిగతావాటి జోలికి మేం రాం… అంటున్నారు. ఇందులో ఆవు వారికి గోమాత. రైట్ వింగ్ సంస్థలు ఒకడుగు ముందుకేసి గోమాతను తల్లి కన్నా అగ్రభాగాన నిలిపేందుకు పోటీ పడుతున్నాయి. అయోధ్యలో ఆలయం కోసం ఎలాంటి సెంటిమెంట్ ను దేశవ్యాప్తంగా ఆనాడు రంగరించారో ఇప్పుడు గోమాత సెంటిమెంట్ ను అంతకన్నా బలంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇది హిందూ భావజాల ఆధిపత్యాన్ని దేశ ప్రజల్లో సుస్థిరం చేసే ప్రయత్నంగా హైందవేతరులకు లేదా సెక్యులరిస్టులకు కనిపించడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీలేదు.
ఇక బీఫ్ ను సమర్థించేవారిలో ఎంతమంది ప్రతిరోజూ బీఫ్ తింటున్నారో తెలీదు కానీ… తినేవారి పక్షాన వీరు ఇల్లు పీకి పందిరేసేంత పని చేస్తున్నారు. కొన్నిచోట్ల పనిగట్టుకొని బీఫ్ ఈటింగ్ సెంటర్లను తెరిచి దారిన పోయేవారందరికీ ఉచితంగా తినిపిస్తున్నారు. చూశారా… దేశంలో ఇంతమంది బీఫ్ తినేవాళ్లున్నారు… ఎలా బ్యాన్ చేస్తారో చేయండి చూద్దాం… అంటూ సర్కారుకు సవాళ్లు విసురుతున్నారు. ఒకరకంగా వీరు బీఫ్ తినడం ఒక ఆహారపు అలవాటుగా కాక కసితో ఆ పని చేస్తున్నారు. దీన్ని హైందవ వ్యతిరేక భావజాలానికి పరాకాష్టగా హిందూ సంస్థలు పరిగణిస్తున్నాయి. అయితే పైన పేర్కొన్న రెండు లక్షణాలు (బీఫ్ ను వ్యతిరేకించడం, సమర్థించడం) ఒకే నాణేనికి ఉండే రెండు పార్శ్వాల్లాంటివన్నమాట. ఎందుకంటే ఒకరు పని గట్టుకొని వ్యతిరేకిస్తారు. ఒకరు పనిగట్టుకొని సమర్థిస్తారు. కానీ సగటు బీఫ్ వినియోగదారుడికి ఈ ఇద్దరి దృష్టి కోణాలతోనూ పన్లేదు. తన దృష్టిలో ఈ ఇద్దరూ రాజకీయ పగటివేషగాళ్లే.
బీఫ్ చుట్టూ అల్లుకున్న ఆర్థికాంశాలు
మానవ ప్రపంచం మొత్తంలో భారతదేశంలోనే మాంసభక్షణ తక్కువగా ఉండడం విశేషం. అయినప్పటికీ బీఫ్ ఎగుమతుల్లో ఇండియానే నెంబర్ వన్ గా ఉంటోంది. అందుక్కారణం ఇండియాలో కిలో బీఫ్ 2.88 డాలర్లయితే అదే బ్రెజిల్లో 4.52 డాలర్లు, ఆస్ట్రేలియాలో 4.73 డాలర్లుగా పలుకుతోంది. రుచికరమైన, పోషక విలువలున్న దేశీ ఆవు మాంసం తక్కువ ధరకు దొరుకుతుండడంతో ఇండియన్ బీఫ్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే ఈ ఇండస్ట్రీని మరింత విస్తృతపరచే ప్రతిపాదనలు కూడా సిద్ధమైపోతున్నట్టు సమాచారం. భారత్ నుంచి వరి తరువాత ఎక్కువగా ఎగుమతి అవుతున్నది బీఫేనని అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) చెబుతోంది. ఏటా 29 వేల కోట్ల వ్యాపారం ఈ రంగం నుండి జరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. 2014-15లో రూ. 33,128.30 కోట్ల విలువైన బీఫ్ ఉత్పత్తుల ఎగుమతులు జరిగితే అందులో ఒక్క బఫెలో మీట్ భాగమే రూ. 29,282.60 కోట్లుగా నమోదైంది. 2014లో బ్రెజిల్ 1.18 మిలియన్ టన్నుల బీఫ్ ఎగుమతి చేస్తే, ఆస్ట్రేలియా 1.07 మిలియన్ టన్నులు ఎగుమతి చేసింది. ఇక భారత్ ఆ రెంటినీ తలదన్ని 1.56 మిలియన్ టన్నుల బీఫ్ ను ఎగుమతి చేయడం గమనించాల్సిన అంశం.
ఇటీవల నరేంద్రమోడీ ఓ హిందీ న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జైన్ మిత్రులకు బీఫ్ ఫ్యాక్టరీలున్నాయని అంగీకరించడం విశేషం. మోడీ స్టేట్ మెంట్లో రెండు అంశాలు గుర్తించవచ్చు. ఒకటి, మోడీ మిత్రులు బీఫ్ వ్యాపారం చేయడం. రెండోది, పూర్తి శాంతి కాముకులైన, హింసా వ్యతిరేకులైన జైనులు బీఫ్ రంగంలో ఉండడం. సంఘ్ పెద్దలు చెప్పుకునే గోమాత ఇంతటి చక్రబంధంలో ఇరుక్కున్న తరువాత దానికి మోక్షమేమిటో వారే జవాబు చెప్పాలి. అంతేనా? మేక్ ఇన్ ఇండియా కాన్సెప్టులో విదేశాల నుంచి ఆకర్షిస్తున్న పలు ప్రాజెక్టుల్లో లెదర్ ఇండస్ట్రీకి సంబంధించినవి కూడా ఉండడం విశేషం. లెదర్ ఇండస్ట్రీకి ముడిసరుకు ముఖ్యంగా బఫెలోనే కావడం మరో విశేషం.
ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ప్రకారం 2014 మార్చి 31 వరకు ఇండియాలో 1623 గుర్తింపు పొందిన కబేళాలున్నాయి. మహారాష్ట్రలో 316, యూపీలో 285, ఉమ్మడి ఏపీలో 183, తమిళనాడులో 130, కర్నాటకలో 96 కబేళాలున్నాయి. ఓ లెక్క ప్రకారం 2004లో ఇండియాలో చట్టపరమైన అనుమతులున్న కబేళాలు 3600 ఉండగా, అక్రమంగా 30 వేలకు పైగా కబేళాలున్నాయి. 2013లో ఉమ్మడి ఏపీలో 6 కబేళాలకు మాత్రమే అనుమతులుండగా 3100 అక్రమ కబేళాలు గోవుల్ని యథేచ్ఛగా ఊచకోత కోస్తున్నాయి. అయితే కబేళాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని మున్సిపల్ అథారిటీ అజమాయిషీలో పనిచేస్తాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. పూర్తిగా రాష్ట్రమే చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా నిషేధాన్ని అమలు చేస్తామనడం, అందుకోసం ఒత్తిడి చేయడం ఆహ్వానించదగ్గ చర్య కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 స్ఫూర్తితో పలు రాష్ట్రాలు గోహత్యను నిషేధించాయి. దేశంలో ఎక్కడా కూడా గోహత్య నిషేధం పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. అందుక్కారణం సమస్య సున్నితమైంది కావడం ఒకటైతే, ఇది ఆహారపు అలవాట్లు, కల్చర్ కు సంబంధించిన అంశం కావడం మరోటి. రాజకీయ ప్రయోజన కాంక్ష అనేది ఆ రెంటికన్నా మరింత ముఖ్యమైంది. కాబట్టి నిషేధాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కారు కాబట్టి తన పాత ఎజెండాలో ఉన్న గోహత్య అంశాన్ని చాలా తెలివిగా, బలంగా ముందుకు తెస్తోంది. మొన్న యూపీలో ప్రాణాలు కోల్పోయిన అఖ్లక్ ఉదంతాన్ని అందుకు తాజా దృష్టాంతంగా చెప్పుకోవచ్చు.
సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ స్టడీస్ (సీఎస్డీఎస్) నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 31 శాతం మంది భారతీయులు వెజిటేరియన్లు. ఇక వెజిటేరియన్లుగా ఉన్న ఫ్యామిలీలు కేవలం 21 శాతం మాత్రమే. భారతీయుడు సగటున రోజుకు 12 గ్రాముల మాంసం భుజిస్తుంటే అది ప్రపంచ సగటు 115 గ్రాములుగా ఉంది. అమెరికాలో 322 గ్రాములు, చైనాలో 160 గ్రాములుగా ఉంది. ఇండియన్ నాన్-వెజిటేరియన్ కన్నా అమెరికన్ నాన్-వెజిటేరియన్ దాదాపు 25 రెట్ల మాంసాహారి. పై రెండు గణాంకాల ప్రకారం వెజిటేరియన్లు భారత్ లోనే ఎక్కువ. అయినా బీఫ్ మీద గోల మాత్రం ప్రపంచంలో ఎక్కడా జరగనంత రచ్చ ఇండియాలోనే జరుగుతుంది. దానిక్కారణం వేరే చెప్పాల్సిన పన్లేదు. అవన్నీ భావజాలాల సిగపట్లు మాత్రమే.
పర్యావరణ కోణాలు
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై అవగాహన విస్తృతమవుతోంది. దానికోసం అనేక సంస్థలు, సంఘాలు తీవ్రంగా పనిచేస్తున్నాయి. మాంసాహారానికి వ్యతిరేకంగా అనేక జీవకారుణ్య సంఘాలు కృషి చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక ఎదిగిన బ్రాయిలర్ కోడి సుమారు రెండు కిలోలు తూగితే… అది తీసుకున్న దాణా సుమారు 6 నుంచి 8 కిలోలు. పర్యావరణ రీత్యా, మనిషి ఆరోగ్య రీత్యా పై రెండింటిలో ఏది బెటరో చెప్పడానికి ఎవరూ సంకోచపడనక్కర్లేదు. అయినప్పటికీ చికెన్ చికెనే. దాన్నుంచి వచ్చే తృప్తి ముందు 6 కిలోల మొక్కజొన్న గింజలు ఇచ్చే ఆరోగ్యం ఎక్కువ కాకపోవచ్చు (సందర్భాన్ని బట్టి). కానీ పర్యావరణవేత్తల దృష్టి కోణంలో ఒక పశువును బలిస్తే తద్వారా వాతావరణంలోకి పరోక్షంగా వెలువడే కాలుష్య కారక ఉద్గారాలు చాలా ఎక్కువ. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్ మెంట్ ప్రోగ్రామ్ ఇటీవల జరిపిన ఓ సదస్సులో ప్రపంచ పర్యావరణానికి ప్రత్యేకంగా చేటు చేస్తున్నది మాంసాహారులు, అందులోనూ గోమాంస భక్షకులేనని ఆందోళన వ్యక్తం చేసింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిపుణులు ఏమంటున్నారంటే ఒకరు బీఫ్ తినడం మానేస్తే పర్యావరణం కోసం జీవితకాలం కారును వదిలేయడంతో సమానమట. జంతుబలుల ద్వారా 18 శాతం కాలుష్యం జరుగుతుంటే… వాహనాల వాడకం ద్వారా 15 శాతం కాలుష్యం జరుగుతోంది. అంటే వాహనాలు వాడేవారందరూ మాంసాహారం మానేస్తే వారు అప్రయత్నంగానే పర్యావరణానికి సగం నష్టం తగ్గించినవారవుతారన్నమాట. ఈ క్రమంలోనే ఫ్రెంచికి చెందిన ఓ పర్యావరణ ప్రేమికుడు లారెన్స్ వారంలో కనీసం ఒక్కరోజైనా బీఫ్ మానాలని ప్రచారం చేస్తున్నాడు.
గోమేధ, అశ్వమేధ యాగాలు మళ్లీ సాధ్యమా?
ప్రాచీన సమాజం నుంచి ఆధునిక సమాజం వరకు అనేక మానవీయ భావనలు, అవసరానుగుణంగా నియమించుకునే వెసులుబాట్లు ఏర్పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ప్రపంచం చాలా ముందుకెళ్లిపోయింది. ఒకప్పుడు గోమాంసాన్ని నైవేద్యంగా పెట్టిన సమాజం ఆ తరువాత గోవునే మాతగా పూజించింది. రక్త సంబంధంతో ప్రమేయం లేని వైవాహిక వ్యవస్థ రాజ్యమేలిన చోట వావి వరుసల విచక్షణ జ్ఞానం, భ్రాతృ భావనలు పరిఢవిల్లుతున్నాయి. ఆనాడు అలా జరిగింది కదా… ఇవాళ ఎందుకు జరగరాదని వాదించేవారిది మూర్ఖపువాదనగానే మిగులుతుంది. ఆనాడు గోమాంసం తిన్నది నిజం కాదా? మరి ఇవాళ ఏం మాయరోగమొచ్చిందీ అని ప్రశ్నించేవారి అజ్ఞానానికి ఓ రెండు నిమిషాలు మౌనం పాటించడం మినహా చేయగలిగింది లేదు. కాబట్టి ఎవరేది తింటారో వారినది తిననిద్దాం. సమాజానికి, పర్యావరణానికి ఏది అవసరమో దాని మీద అవగాహన కల్పిద్దాం. అవసరమైతే ఆసక్తికరమైన రాయితీల అంశాన్ని కూడా పరిశీలిస్తే పోయేదేమీ లేదు. ఏ భావజాలమైనా వ్యతిరేకాత్మక దృక్కోణంలో కాకుండా సానుకూల వైఖరిలో ముందుకెళితే ఏదైనా సాధ్యమే.
వాదాలు – భేదాలు
- సనాతన సంప్రదాయ పునాదులు బలంగా ఉన్న ఇండియాలో గోహత్య నిషేధం కోరుతూ పెద్దఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ డిమాండుతో బయటపడనివారు కూడా గోసంతతిపై పెద్దసంఖ్యలో సానుభూతిపరులుగా ఉన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే ఇందుకోసం బలమైన చట్టం తేవాలంటూ గాంధీజీ ముందుకు విజ్ఞాపనలు వచ్చాయి. స్వయంగా ఆయన కూడా గోహత్యకు వ్యతిరేకి కావడంతో ఆ డిమాండ్ సాకారమవుతుందని అంతా భావించారు. అయితే గాంధీ అది తన వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే ప్రకటించుకున్నారు. కొందరైతే గోహత్యను నిషేధించాలంటూ అప్పట్లోనే ఆమరణ నిరాహార దీక్షలకూ దిగారు. అయితే గాంధీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. అలాంటి డిమాండ్లు చేస్తే పాక్ లాంటి దేశంలో హిందువుల పరిస్థితేమిటంటూ ఎదురు ప్రశ్నించాడు. ముస్లింలు బీఫ్ తినడం, తినకపోవడం వారిష్టం. మన (హిందువుల) కోసం సోదరభావంతో వారు మానేస్తే అంతకన్నా సంతోషించాల్సింది లేదు. కానీ బలవంతంగా వారిపై మన అభిప్రాయం రుద్దడం సరికాదని గాంధీ భావన.
- ఒక సందర్భంలో గాంధీ తనకు తెలిసిన ఓ వైష్ణవ మిత్రుడు అనారోగ్యంతో ఉన్న తన కొడుక్కి ప్రతిరోజూ బీఫ్ సూప్ తాగించేవాడని చెప్పుకున్నారు. అదేంటి? వైష్ణవుడివై ఉండీ గోమాంసాన్ని ఎలా వాడుతున్నావు అని అడిగితే… గోమాంసంలో ప్రత్యేకమైన ఔషధ గుణాలున్నాయి.. ఆ జబ్బుకు అదే మందు అని ఆయన చెప్పాడట.
- ఇక వివేకానందుడి గురువు రామకృష్ణ పరమహంస అన్ని మత గ్రంథాలనూ పఠించాడు. భగవద్గీతను ఎంత భక్తితో పఠించేవాడో, ఖురాన్, బైబిల్ లను కూడా అంతే నిష్ఠగా పఠించేవాడు. ఖురాన్ ను పఠించేటప్పుడు గోమాంసాన్ని నెత్తిపై పెట్టుకొని పఠించేవాడని చెబుతారు. ఆయన శాకాహారి కాబట్టి మాంసం ముట్టడు. కానీ ఇస్లాం ప్రకారం గోమాంసం ముఖ్యమైంది కాబట్టి దాన్ని నెత్తిన పెట్టుకోవడం ద్వారా ఇస్లాంను ఆయన మనసా, వాచా, కర్మణా అంగీకరించాడని చెబుతారు. అలా అంగీకరించకుండా, మనసులో కల్లోలంతో ఏ గ్రంథం చదివినా అందులోని సారం అర్థం కాదనేది రామకృష్ణుడి భావన. అయితే రామకృష్ణ పరమహంస గోమాంసం తిన్నాడని, తినలేదని చెప్పడం వాస్తవాలు మరుగుపరచడమేనని చెప్పేవారు కూడా ఉండడం విశేషం.
- నేటి కాలంలో ఇండియా అయినా, మరే దేశమైనా బీఫ్ ను గానీ, పోర్క్ ను గానీ నిషేధించే పరిస్థితుల్లేవని రోజురోజుకూ మారిపోతున్న గణాంకాలే చెబుతున్నాయి.
- బీఫ్ ను దేశవ్యాప్తంగా నిషేధించడం సాధ్యం కాదని, అది రాష్ట్రాల అభిప్రాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పడం గమనించాలి. బీఫ్ తినేవారు పాక్ వెళ్లాలన్న కేంద్రమంత్రి నక్వీ వ్యాఖ్యలను వ్యక్తిగతమైనవిగా కొట్టిపారేయడం విశేషం.
Advertisements