ఈ కథనానికి పెట్టిన శీర్షిక బీజేపీ నాయకులకు కోపం తెప్పించవచ్చు. అయితే కోపం తెచ్చుకునే ముందు వారేం చేస్తున్నారో, ఎన్ని చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నారో ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రజలకు మరింత దగ్గరవుతారని చెప్పడమే ఇందులో అసలు ఉద్దేశం. దీనికి నేపథ్యం ఏమిటంటే నవంబర్ 6వ తేదీన హైదరాబాద్, పనామా గోడౌన్స్ దగ్గర స్వాగత్ గ్రాండ్ హోటల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు పోచంపల్లి గిరిధర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. “ఎ టాక్ ఆన్ డెవలప్ మెంట్ ఫర్ ఆల్ ఇన్ హైదరాబాద్” అనే అంశం చుట్టూ నేతలు ప్రసంగించారు. జనవరిలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశం జరిగిందనేది వేరే చెప్పాల్సిన పన్లేదు. అయితే అభివృద్ధిని క్లెయిమ్ చేసుకుంటూ హైదరాబాద్ జనంలోకి వెళ్లి బీజేపీ నేతలు ఓట్లడిగే ఒకానొక భూమికను తయారు చేసుకోవడం ఈ సమావేశం ముఖ్యఉద్దేశంగా కనిపించింది. దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన వ్యక్తి బీజేపీ జాతీయ కార్యదర్శి పి.మురళీధరరావు. ఒక డివిజన్ స్థాయి సమావేశానికి మురళీధరరావు లాంటి జాతీయ స్థాయి నాయకుడు రావడం, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గానీ, రాష్ట్రంలో ప్రముఖులైన ఇతర నేతలు గానీ ఈ సమావేశంలో లేకపోవడం ఒక చర్చనీయాంశమైతే ప్రధానవక్త ప్రసంగంలో చోటు చేసుకున్న అంశాలు బీజేపీకి లాభం కన్నా నష్టదాయకంగా పరిణమించే సూచనలు గోచరిస్తుండడం రెండో అంశం.

          చాలా చిన్న వయసులో జాతీయస్థాయి నేతగా ఎదిగిన మురళీధరరావు మీద తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజల్లో ఒక ఉన్నతమైన ఊహాచిత్రం ఉంది. కానీ జీహెచ్ఎంసీ అనే చిన్న చిత్రం కోసం తెలంగాణలో బీజేపీ అనే పెద్దచిత్రాన్ని పణంగా పెడుతున్నట్టు మురళీధరరావు మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు, వాటికి బలాన్నిచ్చే ఇతర చారిత్రక ఆధారాలు సేకరించి ఉటంకించడం వంటివి సామాన్యుడికి అనవసరంగానే కాదు అసందర్భంగా కూడా కనిపిస్తున్నాయి. ఎంతో సమయం కేటాయించి, ప్రసంగంలోని ప్రతీకలను జాగ్రత్తగా ఎంపిక చేసుకొని, జాతీయ, ప్రాంతీయ రాజకీయాల నేపథ్యాన్ని పేర్చుకుంటూ ఇచ్చిన ప్రజెంటేషన్ ఇంత పేలవంగా ఉంటుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఆయన జాతీయ నేత కాబట్టి ప్రాంతీయ అవసరాలతో పనిలేదని భావించారో ఏమో తెలియదు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ఓసారి విశ్లేషిద్దాం.

1)      హైదరాబాద్ లో అందరి అభివృద్ధి అందరితో కలిసి, ఏ కొందరికోసమో కాదంటూ పి.మురళీధరరావు (పీఎమ్మార్) ప్రసంగం మొదట్లోనే తానెవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో స్పష్టంగానే చెప్పారు. హైదరాబాద్ నిర్మించింది కేవలం నిజాంలు మాత్రమే కాదు, చాళుక్యులు, కాకతీయులు, బహమనీలు, కులీకుతుబ్ షాహీలతో పాటు ఆ తరువాత వచ్చిన ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా కారణమన్నారు. ఆయన ఉటంకించిన పేర్లలో నిజాంలు కూడా ఉన్నారు కదా. అభివృద్ధిలో నిజాం జమానానే కీలకం కదా. ఆధునిక రైల్వే వ్యవస్థ, పవర్ ప్లాంట్, ప్రత్యేక ఆర్టీసీ, అనేక దవాఖానాలు… ఇవన్నీ నిజాంల హయాంలోనే కదా ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమం పుణ్యాన నిజాంలపై ఉన్న అపోహలు (లేదా దుష్ప్రచారాలు) చాలావరకు క్లియర్ అయ్యాయి. అలాంటప్పుడు ఈ మాటల్లోని ఉద్దేశం బీజేపీకి ఎలా మేలు చేస్తుంది?

2)      ఇక తాను 30 ఏళ్లలో భారత్ లో గడపని నగరం లేదని, ఏయే నగరాల్లో ఏయే వాతావరణ ఇబ్బందులుంటాయో పూర్తిగా తెలుసని చెప్పుకున్నారు. వాటిల్లో హైదరాబాద్ కన్నా గొప్ప నగరం ఎక్కడా లేదన్నారు. హైదరాబాద్  తరువాత బెంగళూరు, పుణే, కోయంబత్తూర్ నగరాలు తరువాతి వరుసలో ఉంటాయని చెప్పారు. ఇక ఢిల్లీకైతే తనదంటూ వాతావరణం లేదని, అది పనిగంటల మీద ప్రభావం చూపుతూ ఉత్పాదకతను నిర్దేశిస్తుందన్నారు. ఈ వరుసలో ఏడాది పొడవునా పనిచేసే వాతావరణం ఒక్క హైదరాబాద్ లోనే ఉందని, అది భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరమని చెప్పారు. అలాంటి హైదరాబాద్ ను వదిలి ఆంధ్రా ప్రజలు ఎవ్వరూ వెళ్లరని, వెళ్లే ప్రసక్తి కూడా లేదని కుండబద్దలు కొట్టారు. ఇంకా ఏమన్నారంటే హైదరాబాద్ కు సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చే ప్రమాదం లేదని, అదే కోస్తాలో అయితే ప్రతియేడూ ఏదో ఒకచోట తుఫాన్లు వస్తూ ప్రజల్ని నష్టపరుస్తుంటాయని చెప్పారు. ఈ మాటల అర్థమేంటో, వాటి ప్రభావ, ప్రయోజనాలెలా ఉంటాయో కనుక్కోవడానికి పెద్ద తెలివితేటలేమీ అక్కర్లేదు. ఆంధ్రా ప్రజలు వెళ్లిపోవాలని తెలంగాణవాదులు గానీ, టీఆర్ఎస్ నాయకులు గానీ ఎప్పుడైనా అన్నారా? గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోనే కేసీఆర్ ఆంధ్రా ప్రజల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని వారికి భరోసా ఇవ్వడం మరిచారా? రామోజీరావు అధీనంలోని భూములన్నీ సవ్యంగానే ఉన్నాయని కితాబివ్వడం గుర్తులేదా? అసలు ఆంధ్రా ఉద్యోగులను, వ్యాపార వర్గాలను వీలైనంత త్వరగా ఆంధ్రాకు తరలించాలని చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తుంటే వాళ్లు ఇక్కడే ఉంటారని మురళీధరరావు చెప్పడం ఏ స్థాయి విజన్? ఒక ప్రాంత (రాష్ట్ర) పార్టీని మరో ప్రాంత ప్రజల (తెలంగాణలో అతిథులు) దృష్టిలో శాశ్వత శత్రువుగా చూపించేందుకు యత్నించడం ఎక్కడి జాతీయత? జీహెచ్ఎంసీ మేయర్ సీట్ ను టీడీపీతో కలిసి ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఆంధ్రా ప్రజలు ఎక్కడికీ వెళ్లరంటూ పీఎమ్మార్ వకాల్తా పుచ్చుకుంటే.. ఇప్పటికే పంటితో ముళ్లు పీకుతానన్న కేసీఆర్… మరింత దిగజారి వారి ముడ్లు కూడా కడుగుతానని చెప్పాలని పీఎమ్మార్ కోరుకుంటున్నారా? దేశమంతా అన్ని పార్టీలూ ముస్లిం సంతుష్టీకరణ కోసం పరుగులు తీస్తున్నాయంటూ హిందువులను రెచ్చగొట్టే బీజేపీ.. తెలంగాణలో ఆంధ్రా ప్రజల సంతుష్టీకరణ కోసం ఇంతలా దిగజారిపోవడం ఎవరి ప్రయోజనాల కోసం?

3)      ఇక పదేళ్లలో హైదరాబాద్ 87 శాతం పెరిగిపోయిందన్న పీఎమ్మార్ కేవలం తెలంగాణ, ఆంధ్రా ప్రజల రాక వల్ల మాత్రమే హైదరాబాద్ జనాభా పెరిగిపోలేదన్నారు. గుజరాత్, బీహార్, రాజస్థాన్, అస్సాం వగైరా రాష్ట్రాల నుంచి కూడా వలసలు జరిగాయన్నారు. తెలుగు మాట్లాడేవారితో పోటీగా తెలుగేతరుల సంఖ్య (సుమారు 25 లక్షలు) కూడా పెరిగిందని, వారందరి అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అన్నారు. మరలాంటప్పుడు హైదరాబాద్ ను వీడి ఆంధ్రా ప్రజలు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పడం దేనికి? గుజరాతీలు, బీహారీలు వగైరా అందరూ ఎక్కడికీ వెళ్లొద్దని ఎందుకు చెప్పరు? ఒక్క ఆంధ్రాప్రజల్ని మాత్రమే సంతృప్తి పరచాల్సిన అవసరం ఎందుకొచ్చిందో చెప్పగలరా? తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్ని మీడియా సంస్థలు ఆంధ్రా నాయకుల నోటి నుంచి హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్రా ప్రజల సంఖ్య 80 లక్షలకు పైబడే ఉందని చెప్పించాయి. మరి మిగతావారి జాడేది? తెలంగాణ జనమంతా ఏమైపోయారు? గుజరాతీలు, బీహారీలు ఏమైపోయారు? ఏ ఉద్దేశంతో వారు ఇలాంటి తప్పుడు లెక్కలు చూపించారు? వారికిప్పుడు బీజేపీ ఏ అవసరాల కోసం బాసటగా నిలుస్తోంది.. పీఎమ్మారే చెప్పాలి.

4)      ఇక పార్లమెంట్ సహకారం లేకుండా తెలంగాణ వచ్చేదే కాదన్నారు. మిగతా ప్రాంతాల మద్దతు లేకుండా ఏ రాష్ట్రమూ ఏర్పడదన్నారు. దేశమంతా కలిసి ఇచ్చిన తెలంగాణలో మిగతా ప్రాంతాలవారికిచ్చే గిఫ్ట్ ఇది కాదని, ప్రాంతీయవాదాన్ని పెంచడంలో తెలంగాణ అభివృద్ధి లేదనీ అన్నారు. పీఎమ్మార్ సార్.. పార్లమెంట్ అంటే ఒక్క ఆంధ్రా నాయకులేనా?తెలంగాణకు అవసరమైన మద్దతు దేశంలోని చాలా పార్టీలు ఇచ్చాయన్నది అవసరార్థం మరచిపోతే ఎలా సార్? అవన్నీ జరిగింతరువాతనే కదా పార్లమెంట్ కు వచ్చింది?పార్లమెంట్లో మీ పార్టీ నాయకుడు వెంకయ్యనాయుడు ఎలా వ్యవహరించారో అందరూ చూశారు. ఆయన ఏ నాయకులకు కొమ్ము కాశాడో దేశమంతా చూసింది కదా? కొత్త రాష్టాల ఏర్పాటు ఎంత సులభమో మీ పార్టీ హయాంలోనే రుజువైంది కదా. ఒక్క తెలంగాణ విషయంలోనే మీరు డబుల్ గేమ్ ఎందుకు ఆడారో తెలంగాణ బిడ్డగా మీరైనా సమాధానం చెప్పగలరా? మీ పార్టీ ఎవరి ప్రభావంలో పనిచేస్తోందో మీరు ఒప్పుకోకపోయినా హైదరాబాద్ ప్రజానీకం బాగా అర్థం చేసుకుంది సుమా.

5)      బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా అంబేద్కర్ పని చేస్తున్న కాలంలో ఆయన ఆదేశాలు అందుకున్న కొందరు అనుచరులు ఓ గ్రామంలోని 8 బ్రాహ్మణ కుటుంబాలను బహిష్కరించారని, అది విన్న అంబేద్కర్ తాను చెప్పింది వారికి అలా అర్థమైందా అంటూ వాపోయాడని పీఎమ్మార్ మరో అసంబద్ధమైన ఉదాహరణను ఉటంకించారు. తెలంగాణలో 300 కు పైగా గుంటూరు పల్లెలు (ఆంధ్రా సెటిలర్ల గ్రామాలు) ఉన్నాయి. కనీసం ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడైనా ఆ పల్లెల మీద ఈగ వాలిందా? అప్పుడే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనప్పుడు ఇప్పుడేదో అవుతుందని బీజేపీ నేతలకు ఎందుకనిపిస్తున్నదో? తాము కూడా ఇక్కడి ప్రజల్లో కలిసిపోయామని భావించిన కొన్ని గుంటూరు పల్లెలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉదంతాలు కూడా ఉన్నాయి కదా. మరిచారా?

6)      తెలంగాణ ఆర్థిక వ్యవస్థ హైదరాబాద్ మీదే ఆధారపడి ఉందన్నారు. మిగతా ప్రాంతాల వాటాను కావాలనే ఎందుకు మరవాల్సి వచ్చింది? ఇదే మాటను మిగతా తెలంగాణ జిల్లాల్లో చెప్పగలరా? రెండు వేల నెల సంపాదన లేని కుటుంబానికి ఐటీ వల్ల నెలకు 20 వేల దాకా ఆదాయం వస్తోందని, అది హైదరాబాద్ అభివృద్ధి వల్లే సాధ్యమవుతోందన్నారు. అసలు అచ్చమైన హైదరబాద్ లో ఐటీ వాటా ఎంత.. ఐటీ ఉద్యోగుల్లో తెలంగాణ యువతీ యువకులు ఎంతమంది ఉన్నారు.. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలంటూ లక్షలకు లక్షలు గుంజి బోర్డు తిప్పేసిన యాజమాన్యాల మూలాలు ఏవి.. ఎంతమంది తెలంగాణ యువతీ యువకుల్ని వారు బురిడీ కొట్టించారు.. ఐటీ ఉద్యోగుల్లో ఆంధ్రా-తెలంగాణ వాటా ఎంత.. పీఎమ్మార్ ఈ లెక్కల గుట్టు విప్పగలరా?

7)      ఇక బాహుబలి సినిమాను ఆకాశానికెత్తేయడం ఎవరి మెప్పు కోసమో అర్థం చేసుకోలేని వెర్రిబాగుల వాళ్లా తెలంగాణ ప్రజలు? హాలీవుడ్ కు దీటుగా తెలుగు ఇండస్ట్రీ ఎదిగిందని, ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల ఒక్క వర్గమే కాదు.. చాలా వర్గాలకు లబ్ధి జరిగిందన్నారు పీఎమ్మార్. అలాంటి అనేక వర్గాల్లో తెలంగాణ పేద కళాకారులకు, ఇక్కడి భూమి పుత్రులకు దక్కిన అవకాశాలెన్నో చెబితే బాగుండేది.

హైదరాబాద్ లో ప్రాంతీయ సామరస్యత కాపాడాలని పీఎమ్మార్ మరీమరీ చెప్పుకొచ్చారు. మరి మత సామరస్యం మాట ఎందుకు గుర్తుకు రావడం లేదు? పీఎమ్మార్ మాటల్లో బీజేపీ జాతీయవాదం మాటున ప్రాంతీయ ఆధిపత్య పిపాస కనిపిస్తుండగా.. రాష్ట్రం ఏర్పడ్డా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ వివక్షను మౌనంగా భరిస్తున్న తెలంగాణ ప్రజలది ప్రాంతీయ అస్తిత్వంతో కూడిన జాతీయ భావనగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పైన చెప్పుకున్న శీర్షికను మరోసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది.

ఇక ఇదే వేదికపై బీజేపీ రైతు విభాగం (కిసాన్ మోర్చా) నాయకుడు సుగుణాకర్ రావు కూడా పాల్గొన్నారు. మురళీధరరావు కన్నా ముందు ఆయన ఒకటి, రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడినా చాలా అర్థవంతమైన అసలైన జాతీయ దృక్పథాన్ని కనబరిచారు. ఏమన్నారంటే.. రాజకీయ నాయకులను మన ప్రజానీకం చాలా అసహ్యించుకుంటోందని, అబద్ధాలు మాట్లాడడం, అవసరం కోసం మాట్లాడడం, సొంత ప్రయోజనాల కోసం దిగజారిపోవడం వంటి లక్షణాలు ఒక్క రాజకీయ నాయకుల్లోనే కనిపిస్తున్నాయని, నాయకులు ఇకనైనా వీటికి దూరంగా ఉంటే ప్రజల్లో మన గురించి మంచిమాటలు చెప్పుకుంటారన్నారు. ఎంత తేడా?

కొసమెరుపు : హైదరాబాద్ అందరిదీ, ఆంధ్రా ప్రజలు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు అంటున్న బీజేపీ జాతీయనేత తమ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి స్థానంలో ఏ ఆంధ్రా హరిబాబునో నియమించుకుంటే బెటర్ కదా. ఎందుకంటే మనది భారత జాతి. భారతీయులంతా ఒకటే. ఏమంటారు?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s