(చాయ్ పే చర్చ)

(గా యాల్ల ఐతారం. బావ-బామ్మర్దులకు ఏడ పొద్దుపోతలేదు. గందుకని బాతాఖానీ కొట్టనీకి ఇరానీ హోటల్కు బోయిండ్రు. గరంగరం చాయ్ కి ఆడరిచ్చిండ్రు. ఇగ ఊరు మీది ముచ్చట్లల్ల వడ్డరు.)

“బావా… సబలల్ల ఏం జర్గుతదంటవ్?”

ఏం జర్గుడేమున్నదిరా.. .సబలల్ల సమరం జర్గుతది.

“సమరమా.. ?”

ఔరా.. సమరమే.

“సబకు, సమరానికి సంబందమేంది బావా?”

సమరం అంటే విద్దం అన్నట్టు. గా విద్దంల ఏ పార్టి గెల్తదో… తెల్లారి పేపర్లల్ల గాల్లకు మస్త్ మైలేజత్తది. గాల్లే ప్రజల కోసం బగ్గ లొల్లి వెట్టిండ్రని, అత్కారపోల్లను ఆటాడిచ్చిండ్రని జనమందరు చెప్పుకుంటరు.

“ఓహో గా సమరమా..? నేను.. గా డాక్టర్ సమరం అనుకున్న. థూ… నా తెలివి పాడుగాను.”

థూ ఎందుకురా. గా సమరం జెప్పేది గూడ సైన్సేనాయె. దానికి సిగ్గుపడుడెందుకు?

“గట్ల గాదు బావా.. నువ్వు జెప్పే సమరమేమో.. ప్రజల కోసం జేసేటిది. నేననుకున్నది వేరే సమరం. దాన్కి, దీన్కి పొంతనున్నదా బావా.. గందుకే నా ఆలోశ్న నాకే సిగ్గన్పిత్తంది.”

సిగ్గేమున్నదిరా… మన సబికులది.. శాన పెద్ద మన్సు. ఒక్కతీరు సమరం గురించే గాదు.. అన్ని రకాల సమరాల గురించి మాట్లాడ్తరు.

“అన్ని రకాల సమరాలా?”

అవు.

“గా.. డాక్టర్ సమరం జెప్పే సంగతులు గూడ మాట్లాడ్తరా?”

ఒక్క సమరం జెప్పే సంగతులేందిరా.. సీన్మలల్ల ఉండే డబుల్ మీనింగ్ డైలాగులు గూడ మాట్లాడ్తరు.

“అగో… గట్లెట్ల బావా?”

అరే.. మొన్న ఏపీ అసెంబ్లీల నువ్వు జూల్లేదా?

“ఏపీ అసెంబ్లీల డబుల్ మీనింగ్ డైలాగులా?”

అవురా…పన్జూస్కో, పిస్కుత, కామబాబు అసోంటి ఇంకా శానా ముచ్చట్లు ఏపీ అసెంబ్లీల దుమారం లేపినై. అవి మీదమీద చూసుటానికి డబుల్ మీనింగ్ లెక్క కనవడ్తున్నా.. గవ్వీట్ల సింగిల్ మీనింగే ఎక్వున్నది.

“అవు.. కామబాబు ల డబుల్ మీనింగేమున్నది బావా. సింగిల్ మీనింగేనాయె”

మరంటవు… పిస్కుత అంటే గొంతునా పిస్కేది? ఇంకేమన్ననా? గిసోంటి మాటలింటే జనాలేమన్కుంటరు? మన నాయకులు అత్కారపోల్ల మీద సమరం జేత్తండ్రా లేక సమరం మాట్లాడ్తండ్రా అన్కోరా?

“అవు.. బావా నివ్వద్దే. ఇంతకూ సీన్మల మాట్లాడే గీ డబుల్ మీనింగ్ మాటలు ఎవలన్నరు? ఎందుకన్నరు?”

సీన్మ యాక్టర్ రోజమ్మ ఉన్నది గదా.. గామె శంద్రబాబును కామబాబు అన్నదని తెలుగుదేశపోల్లు అగ్గిమీద గుగ్గిలమైండ్రు. ఏడుసార్ల ఎమ్మెల్యే, తొమ్మిదేండ్లు ముక్యమంత్రిగ పన్జేసిన నన్నే గంత మాటంటరా అని చంద్రబాబు బగ్గ ఇదైపోయిండు. పెద్దంత్రం, చిన్నంత్రం లేదా అనుకుంట వార్నింగ్ లు ఇచ్చిండు. ఇగ దీంతోని మంత్రి యనమల రామకృష్ణుడు లేసి రోజమ్మను యాడాద్దాక సస్పెండ్ చెయ్యాల్నని ప్రతిపాదిచ్చిండు. అటెన్క ఏమున్నది ? స్పీకర్ సార్ ఆ తీర్మానాన్ని ఆమోదిచ్చిండు.

“మరి.. కామబాబు అసోంటి బూతు మాటలు సబల మాట్లాడచ్చా బావా?”

ఆంద్రల కాల్ మనీ బాగోతం నడ్తంది కదరా. గదే.. పైసల్ బదలిచ్చి సెక్స్ రాకెట్ నడిపిచ్చుడు. దాన్కి పొట్టి పేరే కాల్ మనీ. గండ్ల టీడీపీ ఎమ్మెల్యేలు గూడ ఉన్నరని, శంద్రబాబే గాల్ల పేర్లు బైటికి రాకుంట జేత్తాండని వైసీపోల్లు లొల్లి జెయ్యవట్టిరి. గందుకనీ కాల్ మనీ శంద్రబాబు అంటే బగ్గ పెద్దగైతంది గదా.. శిన్నగ, ముద్దుగ కామబాబు అని రోజమ్మ అన్నది.  గది అసల్ సంగతి.

“నాకిప్పుడు తెల్సింది బావా.. శెంద్రబాబుకు పొట్టి పేరు పెట్టినందుకు కోపం రాలే. గా పేరు మంచిగ లేనందుకే కోపమచ్చినట్టు గొడ్తంది.”

ఏమాటకామాటే మాట్లాడుకోవాల్రా.. పొట్టి పేరు ఎవలకైనా మంచిగనే ఉంటది. ఉదార్నకు నాగార్జునను నాగ్ అని పిల్సిమనుకో ఆయన సంబురపడ్తడు. చిరంజీవిని చిరు అన్నమనుకో… ఆయనగ్గూడ సంబురమైతది. ఇగ కొందరైతే అసలు పేర్లకన్న ఇంటిపేర్లతోనే పాపులరైండ్రు. గాంధీ, మోడీ, నందమూరి, అక్కినేని, మిక్కిలినేని.. గిట్ల తీసుకున్నమనుకో… వాల్ల అసలు పేర్లు చెప్పే పన్లేదు. అయితే కొందరు లీడల్రు పాపులరైనా గాల్లను ఇంటిపేర్లతోని పిల్వరాదు.

“? ? ? ? ? ? ? ? ? ?”

ఎందుకంటే.. గాల్లను ఇంటిపేర్లతోనే చెప్తే జనమంత నవ్వుకుంటరు. ఉదార్నకు వైఎస్ సర్కార్ ల పిల్లి సుభాష్ చంద్రబోస్ అనేటాయన మంత్రిగ పన్జేసిండు. గాయినకు ఇంటిపేరు, అసల్ పేరు మొత్తం జెప్తేనే జనానికి ఎర్కయితడు. అట్ల గాకుంట ఒక్క ఇంటిపేరుతోనే పిల్లి అని సంబోదిచ్చినమనుకో.. ఆయనను మనం కావల్సుకునే నవ్వులపాల్జేసినట్టు అయితది. ఆయనకు కోపం గూడ వస్తది. టీఆర్ఎస్ సర్కార్ల ఏనుగు రవీందర్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఉన్నడు. ఆయనను ఆ పేరుతోనే చెప్పాలె. అట్లగాకుంట ఏనుగు అని సంబోదిచ్చినమనుకో.. కత ఉల్టకొస్తది. అట్లనే కుక్క, నక్క అసోంటి ఇంటిపేర్లున్న లీడల్రు గూడ ఉన్నరు. కని.. గాల్లను ఇంటిపేర్లతోని పిల్వొద్దు.

“ఓహో.. గవన్ని సరె బావా.. మరి శంద్రబాబు సంగతేందంటవు?”

చంద్రబాబు ఇంటిపేరు నారా. అది మంచిగనే ఉన్నది. కనీ.. అంత పాపులర్ గాలేదు. ఏదో అవసరంకొద్ది అప్పుడప్పుడు మీడియోల్లు నారా అని వాడుతరు.. ఇగ టీడీపోల్లు అత్కారికంగా సీబీఎన్ అని వాడుతరు గానీ అది గూడ అంతగనం పాపులర్ కాలే. వైఎస్సార్, ఎన్టీఆర్, కేసీఆర్ లకు పొట్టిపేర్లు ముద్దొస్తయి. కనీ సీబీఎన్ అంటే టీడీపోల్లకే ఎక్వ మందికి తెల్వదాయె.. ఇగ తతిమ్మోల్లకు ఏందెల్తది?

“మరి గందుకే శంద్రబాబుకు రోజమ్మ ఒక మంచి పొట్టిపేరు కాయం జెయ్యాల్ననుకున్నదో ఏమో?” 

కాయం జేత్తె మంచిదేరా.. ఆ పెట్టే పేరేదో నలుగురికి నచ్చేటట్టు వెట్టాలె. గా పేరు ఇనంగనే ఒక సౌండుండాలె. అబ్బ గా లీడరు పొట్టి పేరెంత మంచిగున్నది.. గసోంటి పేరే నాగ్గూడ ఎవలన్న పెడ్త మంచిగుండు అనిపియ్యాలె. గంతే గనీ.. గిదేం పేరు… గింత దిక్కుమన్లెది… గింత ఛండాలంగున్నది అనుకునేటట్టు ఉండొద్దు. నేనిప్పటిదాకా జెప్పేది గదే గదా.

“అవు.. బావా నువ్వు జెప్పేది నివ్వద్దే.. ఎంత అవుతలి పచ్చమోల్లయినా.. శంద్రబాబును పట్టుకోని రోజమ్మ కామబాబు అనుడు ఏం మంచిగలేదు. కావల్సుకోని ఇజ్జత్ దీసుడే గదా?”

మరి గందుకే.. టీడీపోల్లకు కోపం సర్రుమన్నది. ఒక్క కామబాబేనా.. సబల ఇంకేం మాట్లాడిందో ఏమో.. రోజమ్మ సంగతి గిట్ల గాదు.. ఏడాద్దాక సబల అడ్గు వెట్టకుంట జెయ్యాల్నని పిలాన్ ఏసిండ్రు.. టీడీపోల్లు. గా దెబ్బకు జగన్ ప్రనబ్ ముకర్జీ తాన్కి పొయ్యి షికాయత్ జేసుకోవాల్సచ్చింది.

“రోజమ్మ నోరు ఎంత మంచిది గాకున్నా.. ఏడాది సస్పెండ్ జేసుడయితే మంచిది గాదు బావా. ఏదో.. ఈ అసెంబ్లీ సమావేశాలకో, లేకపోతే ఓ రెండో, మూడో సబల దాకనో పెడితే మంచిగుండు.”

ఏమున్నదిరా.. బుడ్డ లీడల్ర కాన్నుంచి పెద్ద లీడల్ర దాకా ప్రతొక్కలకు అసహనమేనాయె. కోపంల నోటికి ఎంతత్తే గంతే మాట్లాడుడు… దాన్కి అవుతలోల్లు బద్లా దీస్కునుడు.. గివ్వే ఇయ్యాల్ల సబల్లల్ల కనవడ్తన్న రాజకీయాలు. సీన్మలల్ల మాట్లాడే మాటలకన్న సెన్సార్ ఉంటది గనీ… నాయకుల నోటికి, చేతలకు సెన్సారే లేకపాయె. ప్రజల ముంగట పల్సనవుడు తప్ప ఇప్పటి లీడల్రకు పెద్దబుద్ది ఎప్పుడత్తదోరా.

“గాల్లకు పెద్దబుద్ది అత్తదో, రాదో గనీ.. నాకైతే దమాగ్ కరాబైంది. మల్లో కోపెడు గరం చాయ్ దాగుతనే ఏమన్న ఉషారత్తది. ఆడరియ్యి బావా.”

లతీఫ్ భాయి ఔర్ ఏక్ వన్ బై టూ.

——–End——-

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s