media view (1)

తమిళనాడు తరహానే వేరు.. అక్కడ పార్టీకో చానల్

              ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ఆంధ్రా పత్రికలు తెలంగాణలో మళ్లీ తమ స్థానాలు నిలుపుకోగలగడం విశేషమే. ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమ నాయకులను అవహేళన చేసినప్పుడు… ఇలాంటి ఆంధ్రా విషపుత్రికలు తెలంగాణ ప్రజానీకానికి అవసరమా.. అని ప్రశ్నించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక… టీఆర్ఎస్ శాసనసభ్యులను, తెలంగాణ సమాజాన్ని దూషించిన ఆ వర్గపు మీడియాను పదిమీటర్ల లోతులో పాతిపెడతానని నిండుసభలో శపథం చేసిన తరువాత కూడా ఆంధ్రా యాజమాన్యాలు నడుపుతున్న మీడియా సంస్థలు నిలదొక్కుకోవడం, అందుకు కేసీఆర్ ప్రభుత్వం తగురీతిలో ప్రోత్సహించడం చెప్పుకోదగిన అంశాలు. అయితే ఈ ప్రస్తావన ఎందుకంటే తెలంగాణ ప్రజల గొంతుక వినిపించే సొంతింటి మీడియా ఉండాలని అనేక సందర్భాల్లో బాహాటంగా అభిప్రాయపడ్డ కేసీఆర్… తీరా అలాంటి అవకాశాలను మాత్రం కల్పించడం లేదని, మరో మాటగా చెప్పుకోవాలంటే కావాలనే తొక్కిపెడుతున్నాడన్న అభిప్రాయాలు జర్నలిస్టు సంఘాల నుంచీ, సీనియర్ పాత్రికేయుల నుంచీ వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా మాట్లాడిన మాటలకు పాలకుడిగా మారిన తరువాత తీసుకున్న వైఖరులకు మధ్య తలెత్తిన అంతరం అది. అయితే నమస్తే తెలంగాణ ఆవిర్భావం, ఆ తరువాత మరికొద్ది రోజుల్లో రాబోతుందని తెలుస్తున్న తెలంగాణ టుడే వంటి పత్రికలను బలమైన ఆంధ్రా మీడియాకు ప్రత్యామ్నాయ శక్తులుగా మార్చాలన్న సంకల్పం కేసీఆర్ కు ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. కానీ మీడియా సంస్థలను, స్వభావ రీత్యా వాటి లక్ష్యాలను ఏక వ్యక్తి నిర్దేశిత పంథాలోకి ఒదిగిపోయేలా చూడటం అన్నది పాత్రికేయ స్వభావాన్ని, భావ స్వేచ్ఛను,  విలక్షణమైన సామాజిక అవగాహనల్ని పరిమితం చేసే అవాంఛనీయ ప్రయోగం అవుతుంది. ఈ అవగాహనల నుంచే మీడియా విస్తృతి మీద, ఇప్పుడు కొనసాగుతున్న పరిమితుల మీద మాట్లాడుకోవడం మంచిది. అందుకోసం కొంత గతాన్ని, కొన్ని దృష్టాంతాలను స్పృశించక తప్పదు.

                  1990ల్లో ఆర్థిక సరళీకృత విధానాల కారణంగా దేశంలోకి మీడియా సంస్థల ప్రవాహం మొదలైంది. స్టార్, సోనీ, జీ వంటి ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ కూడా అనేక విభాగాలుగా ఎదిగి, ఎన్నో వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ పలు నూతన మీడియా సంస్థలు ప్రజల్ని పలకరించాయి. ఈ క్రమంలో తెలుగు మీడియాను గురించి మాట్లాడుకుంటే రామోజీరావు ఆధ్వర్యంలోని ఈనాడు మాతృక నుంచి 1995లో ఈటీవీ, ఆ తరువాత ఈటీవీ-2 పేరుతో తెలుగులో 24 గంటల వార్తా చానల్ తో పాటు పలు భారతీయ భాషల్లో ప్రాంతీయ వార్తా చానళ్లు విస్తరించాయి. ఆ వెనకే వచ్చిన టీవీ9 తనదైన దూకుడుతో ప్రజల వార్తా దాహాన్ని పెంచగలిగింది. ఈటీవీ బాటలోనే కన్నడ, మరాఠీ, గుజరాతీ వంటి పలు ప్రాంతీయ భాషల్లో అడుగుపెట్టి అప్పటికి తెలుగు మీడియాలో కొనసాగుతున్న ఏకఛత్రాధిపత్యానికి టీవీ9 గండికొట్టింది. ఇక సాక్షి రాకతో తెలుగునాట మీడియాకు ఉండే స్పేస్ మామూలుది కాదన్న సోయి చాలామంది పెట్టుబడిదార్లకు కలిగింది. దాదాపు అదే సమయంలో వచ్చిన ఎన్టీవీ, టీవీ5 వంటి సంస్థలు తమదైన శైలిలో క్రెడిబిలిటీని కాపాడుకుంటూనే ఆర్థికంగానూ నిలదొక్కుకున్నాయి. అయితే ఇది ఒక పార్శ్వం మాత్రమే. మరో పార్శ్వంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికార పగ్గాలు చేపట్టాక ఆంధ్రప్రభ వంటి పత్రికలకూ పునర్జీవితం దక్కింది. వైఎస్ పేరు ప్రతిష్టలతో ఎమ్మెల్యేలుగా, రాజ్యసభ సభ్యులుగా పలువురు మీడియా ప్రతినిధులు కొనసాగడం విశేషం. అయినా ఆయా మీడియా సంస్థలు వాటంతట అవే సొంత కాళ్ల మీద ఎదగలేదన్నది జగమెరిగిన సత్యం. వాటి యజమానుల పుట్టుపూర్వోత్తరాలన్నీ ఏటికి ఆవలి ఒడ్డునే ఉండడం వాటికి కలిసొచ్చిన అంశంగా చెప్పుకోవాలి. ఆవలి ఒడ్డు అనేదానికి గిరీశ్ సంఘీ మినహాయింపు. అలా తెలుగునాట ఎలక్ట్రానిక్ మీడియా ఎంత బాగా విస్తృతమైందో, వాటి యాజమాన్యాల్లో ఉండే సామాజిక సారూప్యతల కారణంగా స్వభావరీత్యా అంతగానూ కుచించుకుపోయింది. అందువల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరిగిందో ఇప్పటికే చర్చోపచర్చలు జరిగినందున ఇప్పుడు మరోసారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పన్లేదు.

            తెలుగునాట మీడియా విస్తరిస్తున్న సందర్భంలోనే మన పొరుగునున్న తమిళనాడులో కూడా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ ప్రతి పార్టీ తనదైన ఓ సొంత నెట్ వర్క్ సృష్టించుకుంది. ఆ నెట్ వర్క్స్ నుంచే న్యూస్ చానల్స్, ఎంటర్ టెయిన్ మెంట్ చానల్స్, సినిమా చానల్స్ ను ఏర్పాటు చేసుకున్నాయి. న్యూస్ మేగజైన్లలోనూ ఇలాంటి పోలరైజేషనే కనిపిస్తుంది. వాటికితోడు జనంతో ఎప్పుడూ కనెక్టివిటీ నిలుపుకోవడానికి ఎఫ్ ఎం రేడియో స్టేషన్లూ నడిపిస్తున్నాయి. తమిళనాడులో 1993లో ఏర్పడ్డ సన్ నెట్ వర్క్ ను బలోపేతం చేయడంలో మామా అల్లుళ్లయిన కరుణానిధి-మురసోలి మారన్ కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సన్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో సన్ టీవీ న్యూస్ ప్రసారాలు, సినిమాలు, ఎంటర్ టెయిన్ మెంట్ ప్రోగ్రామ్స్ వంటి బహుముఖీన కార్యక్రమాలు జనంలోకి బాగా చొచ్చుకుపోయాయి. అందుక్కారణం మామా, అల్లుళ్లు ఇద్దరూ ద్రవిడ ఉద్యమంలో పనిచేయడమే. సినిమాలకు స్క్రిప్టులు, బలమైన డైలాగులు, స్థానిక చారిత్రక అంశాలతో కూడిన హిట్ సినిమాలకు కథలు రాయడం, హిందీ జాతీయవాదానికి బలమైన ప్రత్యామ్నాయంగా ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం వంటి అంశాలు వారికి తమిళనాడులో సన్ నెట్ వర్క్ ను బలంగా తీర్చిదిద్దేలా చేశాయి. అంతకుముందు కూడా ఇదే తాత్విక పునాదుల మీదనే ఇదే మామా అల్లుళ్లు అనేక పత్రికలను విజయవంతంగా నడిపించారు. స్థూలంగా తమిళనాడులో ద్రవిడ ఉద్యమంతో కరుణానిధికి నేరుగా 60 ఏళ్ల అనుబంధం ఉండడం వల్లే ఎలక్ట్రానిక్ మీడియాను అనతికాలంలోనే బలమైన శక్తిగా తీర్చిదిద్దడం కష్టం కాలేదని విశ్లేషకులు చెబుతుంటారు. ఎంజీ రామచంద్రన్ వంటి పాపులర్ యాక్టర్లు సినీ దిగ్గజాలుగా ఎదగడానికి కారణం కరుణానిధి లాంటి తలపండిన రాజకీయ దురంధరులేనన్న అభిప్రాయాలున్నాయి. సన్ టీవీ ప్రసారాలకు డీఎంకే ఆఫీసే కేంద్రంగా ఉందంటే ఆ పార్టీ స్థానిక అంశాలను ఎంతగా ఫోకస్ చేసిందో అర్థం చేసుకోవచ్చు (టీన్యూస్ ప్రసారాలకు కేంద్రం టీఆర్ఎస్ ఆఫీసేనని గమనించాలి). డీఎంకే నుంచి ఎంజీఆర్ విడివడి ఏడీఎంకే (ఆ తరువాత ఏఐఏడీఎంకే) పురుడు పోసుకున్నాక జయలలిత ఆ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కరుణానిధిని ఎదుర్కోవాలంటే ఆయన సృష్టించుకున్న నెట్ వర్క్ కు ప్రత్యామ్నాయం తప్పనిసరి అన్న విషయాన్ని జయలలిత ఆలస్యంగానైనా గుర్తించారు. అందుకే సన్ నెట్ వర్క్ సక్సెస్ ను చూశాక 1999లో జయలలిత జయా గ్రూప్ చానల్స్ ను స్థాపించారు. ఇప్పుడీ చానల్స్ లో అన్నీ అమ్మ వార్తలే. ఎంటర్ టెయిన్మెంట్ చానల్స్ లో అన్నీ అమ్మ సినిమాలే కావడం విశేషం. ఇక హిట్ సినిమాలు ఇచ్చిన ప్రోత్సాహంతో విజయ్ కాంత్ రాజకీయాల్లోకి దిగి రెండుసార్లు మెరుగైన ఫలితాలు రాబట్టారు. మొన్నటి ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగారు. తన రాజకీయ భవితవ్యానికి పూర్వరంగంగా కరుణ, జయ బాటలోనే 2010లో కెప్టెన్ టీవీని స్థాపించారు. ఎన్నికల్లో ఫలితాలెలా ఉన్నా జనం మధ్య ఇప్పటికీ కెప్టెన్ హోదాను నిలబెట్టుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో చూసినప్పుడు తమిళనాడులో రాజకీయ ఆధిపత్యం కోసం లేదా కనీసం ఉనికి నిలుపుకునే ప్రయత్నాల్లో భాగంగా పైన చెప్పుకుంటూ వచ్చిన ద్విముఖ పోటీ లేదా త్రిముఖ పోటీ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. కేవలం తమిళనాడులోనే కాదు.. మలేషియా, సింగపూర్, శ్రీలంక, కెనడా, గల్ఫ్ దేశాల్లోని తమిళ ప్రజల్లో పట్టు నిలుపుకునేందుకు పోటాపోటీగా ప్రసారాలు గుప్పిస్తున్నారు.

                అయితే ఉమ్మడి ఏపీలో అలాంటి పోటీ ఎదుగుదలకు అవకాశం లేకుండా పోయింది. ప్రతి అంశంలోనూ ఒక ప్రాంతం పూర్తిగా విస్మరణకు గురైంది. విచిత్రంగా ఈ అంశాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించినా వారికి నాయకత్వం వహించిన వర్గం మాత్రం ముఖ్యమైన ఈ అంశాన్ని చాలా లైట్ తీసుకుంది. కనీసం ఇప్పుడైనా అలాంటి ప్రయత్నాలు మొదలు పెడదామన్న ఆలోచనలు ఏ నాయకుడికీ పెద్దగా ఉన్నట్టు కనిపించడం లేదు. తమిళనాడులో ఉవ్వెత్తున ఎగసిన ద్రవిడ ఉద్యమాన్ని ప్రజల ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంగా సజీవంగా ఉంచేందుకు (ద్రవిడ ఉద్యమ స్ఫూర్తి అనేక రకాలుగా రూపాంతరం చెందినప్పటికీ) అన్ని పార్టీలూ పనిచేస్తున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమిళ ప్రాంతీయ స్ఫూర్తితోనే అవి ముందుకెళ్తున్నాయి. ప్రజోపయోగమైన పనులు సాధించుకుంటున్నాయి. ఈ విషయంలో తామందరిదీ అప్రకటిత ఏకాభిప్రాయం అన్నట్టుగా తమిళ నేతలు వ్యవహరిస్తారు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక, సొంత ప్రాంతీయ అస్తిత్వం అనే ఒక గౌరవప్రదమైన గుర్తింపు దక్కినా… తెలంగాణలోని అనేక పార్టీలకు, అనేక పార్టీల సీనియర్ నాయకులకు ఆ స్పృహ ఇంకా కలగడం లేదన్న అసంతృప్తి మీడియా ప్రతినిధుల నుంచి, తెలంగాణ మేధావుల నుంచి వ్యక్తమవుతోంది.

                   తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ అత్యంత శక్తిమంతమైన పార్టీగా ఎదిగినా… కాంగ్రెస్, బీజేపీలకు సంప్రదాయంగా వస్తున్న కార్యకర్తల గణం ఉంది. టీడీపీకి కార్యకర్తల గణం ఉన్నా ఓ చెట్టుకు వేరు, కాండం లాంటి బలమైన నాయకుల భాగాల్ని కేసీఆర్ కట్ చేయడం జరిగింది. కాబట్టి టీడీపీని కాసేపు పక్కనపెడితే మిగిలింది బీజేపీ, కాంగ్రెస్ లే. ఆ రెండూ జాతీయ పార్టీలే కావడం చేతా, స్వభావరీత్యా తెలంగాణ నాయకులు ఎవరైనా ఆయా పార్టీల హైకమాండ్ లకు పూర్తి విధేయులుగా ఉండడం వల్లా (పలు సందర్భాల్లో ఈ సంగతి వ్యక్తమైంది కూడా), ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే సొంత ప్రాంతీయ దృక్పథం వారిలో లోపించిందని చెప్పవచ్చు. ఈ లక్షణం వల్లనే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎదిరించలేకపోయారు. ఆయన కాంగ్రెస్ హైకమాండ్ ను బ్లాక్ మెయిల్ చేసినా నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. అంతేకాదు.. ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి కోసమూ మౌనంగా సంతకాలు చేసేశారు. అలాగే తెలంగాణ బీజేపీ నాయకులదీ ఇలాంటి పరిస్థితే. హైకోర్టు విభజన నుంచి కృష్ణా బేసిన్ మీద పెత్తనం కోసం పొరుగు రాష్ట్ర సీఎం ఢిల్లీ లెవల్లో నడుపుతున్న పైరవీలకు వెంకయ్యనాయుడు లోపాయికారీగా మద్దతిస్తున్నా కిమ్మనని చేతనా హైన్యం వారిది. జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన అస్తిత్వం సిద్ధించినా.. పక్కనున్న తమిళనాడు తరహాలో ప్రాంతీయ ప్రయోజనాలే లక్ష్యంగా ఓ బలమైన వ్యవస్థగా ఎదుగుదామన్న ఆలోచన వీరి దరిదాపుల్లో ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకవేళ తెలంగాణ నాయకుల్లో నిద్రావస్థ లాంటి స్థితిలో అలాంటి ఆలోచన ఏదైనా ఉన్నా ముందడుగేసే సాహసానికి పూనుకునే అవకాశాలు దాదాపు శూన్యం. ఒకవేళ చొరవ తీసుకున్నా తెలంగాణ ప్రాంతేతర బలమైన సామాజికవర్గాల అండదండలు లేకుండా ఒక్క అడుగైనా ముందుకు వేయరని ఘంటాపథంగా చెప్పవచ్చు. అదే తమిళనాడు నాయకత్వానికి, తెలంగాణ నాయకత్వానికి ఉన్న తేడా.

media view (5)                 పై లక్షణాల ఫలితంగా ఆయా పార్టీలకు భవిష్యత్తులో జరిగే నష్టాలేంటో అంచనా వేయడం ఆసక్తికరంగా ఉంటుంది. రాజకీయ కారణాల పరిధిలో చూసినప్పుడు తెలంగాణ సాధన పోరాట సమయంలో కాంగ్రెస్, బీజేపీలు స్వయం ప్రేరిత శక్తులుగా పనిచేయలేదు. తెలంగాణ కోసం పనిచేయక తప్పని పరిస్థితులు ఉత్పన్నమైన కారణంగా మాత్రమే అవి ఉద్యమంలో భాగం పంచుకున్నాయి. ఇక టీడీపీ వైఖరి, చంద్రబాబునాయుడు ఉద్దేశాలు, ఆయన వల్లించిన సిద్ధాంతాల కారణంగా ఆ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. దాని ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అయితే గతంలో జరిగిన తప్పిదాలు సరిదిద్దుకొని ప్రజావసరాలు రాబట్టడంలో నిర్మాణాత్మకంగా వ్యవహరిద్దామన్న ఆలోచన పైన పేర్కొన్న ఏ పార్టీలో కూడా ఇప్పటికీ కనిపించడం లేదు. అది లేకపోబట్టే అన్ని పార్టీలూ ఏకమవుతున్న ఆశ్చర్యకరమైన పరిస్థితులు తెలంగాణలో తలెత్తాయి. గతంలో ఎన్నడూ లేని ఇలాంటి పరిస్థితులు అప్రయత్నంగానే టీఆర్ఎస్ కు లాభిస్తూ వచ్చాయి. అయితే ఆయా పార్టీల కలయిక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా కాక వాటిని నానాటికీ బలహీనమైన ప్రయోగంగా మారుస్తోంది. అందుక్కారణాలేంటన్నది ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రాంతీయ సాంస్కృతిక చేతనా స్రవంతిని వారెవరూ అందిపుచ్చుకోకపోవడమే. అయితే కేసీఆర్ ఉద్యమ సమయంలోనే వేసుకున్న పునాదుల కారణంగా రానున్న రోజుల్లో మీడియాపరంగా కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు లేదా తెలంగాణలో సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న ఇతర వర్గాలు.. ఉద్యమ ఫలితంగా తెలంగాణ సమాజం పునికిపుచ్చుకున్న సాంస్కృతిక చైతన్యాన్ని ఒక మంచి అవకాశంగా గ్రహించకపోవడం తెలంగాణ కేంద్రంగా, తెలంగాణ అస్తిత్వంతో ఎదగాల్సిన మీడియాకు అవరోధంగా మారుతోంది. కానీ తెలంగాణలో అలాంటి ప్రయత్నాలు ఎవరు మొదలుపెట్టినా జనాదరణ ఉండి తీరుతుందనేది అనుభవజ్ఞులు చెబుతున్న మాట.

తెలంగాణలో మీడియాకు పెరుగుతున్న అవకాశాలు

MP-Vivek-F-2F  తెలంగాణలో ఇప్పుడు టీన్యూస్, నమస్తే తెలంగాణ మాత్రమే అతిపెద్ద మీడియా సంస్థలు. దానికి పునాదులు కూడా (ఉద్యమ కాలంలో) బలంగానే పడ్డాయి. ఇక మరో మీడియా సంస్థ అయిన వీ6 టీన్యూస్ కి దీటుగా తనకంటూ ప్రత్యేకత సాధించుకుంది. ఆంధ్రాలోనూ బలంగానే ఉంది. తెలంగాణ స్థానిక యాసను పుష్కలంగా వాడుకొని తెలంగాణలోనే కాక ఆంధ్రాలోనూ అభిమానుల్ని సొంతం చేసుకోగలిగింది. కాస్తో కూస్తో పరిచయం ఉంటే చాలు, సజీవమైన ఒక స్థానిక సంస్కృతిని ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఏవిధంగా ఆదరిస్తారనేదానికి తీన్మార్ వార్తలే సాక్ష్యం. కొత్త పుంతల్లో సాగే సృజనాత్మకతకు హద్దులుండవు అనడానికి వీ6 సీఈవో అంకం రవి సృష్టించిన బిత్తిరి సత్తి పాత్రే ఉదాహరణ. తెలంగాణ పల్లెమనిషి ఆలోచనలకు, అమాయకమైన అభిప్రాయాలకు, మొహమాటం లేని నిలదీసే ధోరణికి అతికిపోయినట్టు సరిపోయింది ఆ టీమ్. అంతేకాదు… బిత్తిరి సత్తితో పాటు సావిత్రి, మంగ్లీ ఇప్పుడు సెలబ్రిటీలు అయిపోయారు. తీన్మార్ స్ఫూర్తితో మరిన్ని కొత్త ప్రజెంటేషన్లు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇక 6టీవీ కూడా తెలంగాణ యాజమాన్యానిదే అయినా ఇంకా నిలదొక్కుకోలేదు. ఈ కోవలోకే దక్కన్ టీవీ కూడా వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే మీడియా సంస్థల ఎదుగుదలకు తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పడమే.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s