మల్లన్నసాగర్ లో మతలబు ఏమీ లేదని ముంపు గ్రామాల ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే ప్రాజెక్టుకు భూములు అప్పగించేందుకు సంసిద్ధులవుతున్నారు. నిండా మునుగుతున్న ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్ ప్రజలతో పాటు బంజరుపల్లి, తుక్కాపూర్ గ్రామస్తులు కూడా భూములు రిజిస్ట్రేషన్ చేయించేందుకు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇదే స్ఫూర్తి వేములఘాట్, ఎర్రవల్లి గ్రామాల్లో కూడా కనిపిస్తుందన్న ఆశాభావం మంత్రి హరీశ్ రావు చొరవ ఫలితంగా తెలంగాణ సర్కారులో

వ్యక్తమవుతోంది. ఈ సంచిక బయటికి వచ్చేటప్పటికి మిగతా అన్ని గ్రామాలు కూడా స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర లేదు. ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని మిగతా చోట్ల అనేక ప్రాజెక్టులకు భూసేకరణ అంశం జటిలమై కోర్టు కేసులతో కాలహరణం జరుగుతుండగా ప్రజలంతా మూకుమ్మడి నిర్ణయంతో భూముల రిజిస్ట్రేషన్ కు ఒప్పుకోవడం, గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కౌంటర్లు తెరవడం అనేది తెలంగాణ సర్కారు చారిత్రక విజయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ విజయానికి మూలం ఎక్కడుంది? సర్కారు మీద ప్రజలకు నమ్మకం కలిగించడంలోనే. అయితే స్థిరమైన ప్రజాదృష్టి లేని విపక్షాలు మల్లన్నసాగర్ ప్రాజెక్టు మీద నూటొక్క పిల్లిమొగ్గలు వేసి అభాసుపాలు కావడమే ఆశ్చర్యం.

మల్లన్నసాగరే ఎందుకు?

 తెలంగాణకు కృష్ణా నది కన్నా గోదావరిలోనే సమృద్ధికరమైన జలరాశి ఉందని ఇర్రిగేషన్ నిపుణులు చెబుతారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజెంటేషన్లో కూడా దాన్నే కోట్ చేశారు. ఆ మేరకు కరీంనగర్ జిల్లా కాళేశ్వరానికి దిగువ భాగంలో మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజీ నిర్మించి గోదావరి నీటికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. కోటి ఎకరాల తెలంగాణ భూములు సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యం పూర్తి కావాలంటే.. నోరెండిన భూములకు నీరు సహజంగా పారేలా ఎత్తయిన ప్రాంతంలో నీటిని నిల్వ చేసుకోవాలి. అలా తెలంగాణలో ఎత్తయిన ప్రాంతంగా మెదక్ జిల్లా ఉంటున్నది. ఎత్తు ఒక్కటే కాకుండా ప్రాజెక్టుకు అనువైన స్థలాన్ని కూడా ఎంపిక చేసే క్రమంలో ఒకవైపు కొండప్రాంతం, దాన్ని ఆనుకునే ప్రవహిస్తున్న వాగును గుర్తించి అక్కడే భారీ రిజర్వాయర్ కట్టాలని, అందువల్ల నిర్వాసితులను దాదాపు సగానికి తగ్గించినట్టు అవుతుందని సర్కారు భావించింది. 50 టీఎంసీల నిల్వసామర్థ్యంతో తడ్కపల్లి దగ్గర కడుతున్న ఈ ప్రాజెక్టుకే కొమురెల్లి మల్లన్న పేరుమీద మల్లన్నసాగర్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. మేడిగడ్డ దగ్గర ఆగిన నీటిని భారీ పంపులతో పైపుల ద్వారా పైకి ఎక్కించి మల్లన్నసాగర్ లో నిల్వచేస్తారు. ఇక్కడి నుంచి నల్గొండ, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలుప్రాంతాలకు తాగు, సాగు నీటి అవసరాల కోసం వినియోగిస్తారు. అంతేకాదు.. అత్యవసరం అనుకున్నప్పుడు మహబూబ్ నగర్ కు కూడా దీన్నుంచే పంపాలన్న ఆలోచన కేసీఆర్ లో ఉందని ఆయన సన్నిహితవర్గాల ద్వారా తెలుస్తోంది. సుమారు 9,800 కోట్ల రూపాయల కేటాయింపులతో జరుపతలపెట్టిన ఈ ప్రాజెక్టు కింద 20వేల ఎకరాలకు పైగా భూమి మునిగిపోతోంది. దాదాపు 28 వేల మంది ప్రజలు నిరాశ్రయులవుతుండగా 12 లక్షల ఎకరాల సాగుభూమిని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
ప్రతిపక్షాలు, జేఏసీ ఏమన్నాయి?
ప్రతిపక్షాలు, జేఏసీ ఈ ప్రాజెక్టుపై చాలా విచిత్రంగా వ్యవహరించాయి. ఎలా స్పందించాలో తెలియని స్థితి నుంచి ఎలాగైనా ఆపి తీరాలన్న వైఖరికి మారిపోయి ప్రజల్లో అప్రతిష్టపాలయ్యారు. తొలుత మల్లన్నసాగర్ కు వ్యతిరేకం కాదంటూనే నిరాశ్రయులకు అండగా ఉంటామన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రజలకు దిక్కెవరని ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన జీవో 123 సమ్మతం కాదని, అందులో నిర్దిష్టంగా ఏ ప్రమాణమూ లేనందున 2013లో కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఆ తరువాత ఇంత భారీ ప్రాజెక్టు ఎందుకు? దాని డిజైన్ మార్చాలంటూ ముంపును తగ్గించాలన్నారు. జేఏసీ బ్యానర్ కింద నిరాహార దీక్షలు, పాదయాత్రలు చేశారు. లాఠీచార్జీలు, గాల్లోకి కాల్పుల దాకా వ్యవహారాన్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి అసలు ప్రాజెక్టే అవసరం లేదనే దశకు వెళ్లిపోయారు. ఇలా ఒకే అంశంలో కోటి రాగాలు ఎత్తుకోవడంతో విపక్షాలతో పాటు జేఏసీ కూడా ప్రజల్లో పలుచనైపోయింది.

ఏ చట్టంలో ఏముంది?

 2013 భూ సేకరణ చట్టం ప్రకారం:

–          సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ చేయాలంటే సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలి. ఆ నివేదికను గ్రామసభల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ప్రజలపై పడే ప్రభావం, దానికి ప్రత్యామ్నాయాలు చూపుతూ ప్రభుత్వం చెల్లించే పరిహారాన్ని రాతపూర్వకంగా ప్రజల ముందుంచాలి. వారి అభిప్రాయాలు రికార్డు చేయాలి. ఈ మదింపు అంతా పూర్తయి పర్యావరణ అనుమతులు వచ్చాకే భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టాలి.

 –          సాగునీటి సదుపాయం ఉండి రెండు పంటలు పండే భూమిని సేకరించకూడదు. అలా సేకరించాల్సి వస్తే మరో ప్రత్యామ్నాయం లేదని ప్రభుత్వం నిరూపించాలి.

–          భూసేకరణ నోటిఫికేషన్ దినపత్రికల్లో ఇచ్చిన తరువాత అభ్యంతరాలు తెలియజేయడానికి 60 రోజుల సమయం ఇవ్వాలి. గ్రామసభలో వివరాలు వెల్లడించాలి.

 –          ప్రాజెక్టు ప్రభావిత, నిర్వాసిత కుటుంబాల ఇంటింటి సర్వే నిర్వహించి వారికి పునరావాస, పునరాశ్రయ (Resettlement and Rehabilitation) పథకం తయారు చేయాలి. దాన్ని గ్రామసభలో పెట్టి అభిప్రాయాలు తీసుకోవాలి. ఆమోదం పొందిన పథకాన్ని సంబంధిత ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి.

–          ఆమోదం పొందిన తరువాత రెండోసారి దినపత్రికల్లో నిర్ధారణ ప్రకటన జారీచేసి భూ యజమానులకు, రైతులకు నష్టపరిహారం గురించి విచారణ జరిపే 30 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. ప్రభావిత ప్రజల నుంచి వారు కోరుకుంటున్న నష్టపరిహారం, పునరావాసం గురించి రాతపూర్వకంగా తీసుకోవాలి. మార్కెట్ ధర ఏ విధంగా నిర్ణయించిందీ, నష్టపరిహారం ఎంత చెల్లించాలని నిర్ణయించిందీ ప్రజలకు తెలియజేయాలి. ప్రజల అభ్యంతరాలను, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని కలెక్టర్ ప్రకటించాలి.

 –          భూసేకరణ కోసం ప్రాథమిక ప్రకటన ఇచ్చేముందు మార్కెట్ విలువను తప్పనిసరిగా సవరించాలి. ఇచ్చే పరిహారం సవరించిన మార్కెట్ విలువకు మూడు రెట్ల కన్నా తగ్గకూడదు.

–          అసైన్డ్ భూమి, పట్టా లేకుండా సాగులో ఉన్న భూమికి కూడా పట్టాభూమితో సమానంగా నష్టపరిహారం, పునరావాసం కల్పించాలి.

 –          సాగునీటి ప్రాజెక్టులో భూమి కోల్పోతుంటే ప్రతి కుటుంబానికి నష్ట పరిహారంలో భాగంగా కమాండ్ ఏరియాలో కనీసం ఒక ఎకరం ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకైతే రెండున్నర ఎకరాల లోపు భూమిని సంబంధిత ఆయకట్టులో ఇవ్వాలి. వారికిచ్చే నష్టపరిహారంలో ఈ భూమి మార్కెట్ విలువను మినహాయించి మిగిలిన భూమికి నగదు పరిహారం ఇవ్వాలి.

–          ప్రతి నిర్వాసిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఒకేసారి లేదా రూ. 2 వేల చొప్పున 20 సంవత్సరాలు ఇవ్వాలి. లేదా ప్రాజెక్టులో అవకాశం ఉంటే కనీస వేతనానికి తగ్గకుండా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వీటిలో ఏది కావాలో నిర్వాసితులే నిర్ణయించుకోవచ్చు. ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ప్రకారం అన్ని సౌకర్యాలతో ఇళ్లు, నెలకు రూ. 3 వేల చొప్పున ఏడాదిపాటు రూ. 36,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో రూ. 50,000తో పాటు నివాస బదిలీ ఖర్చుల కింద రూ. 50,000 చెల్లించాలి. నిర్వాసితులకు సంబంధిత ప్రాజెక్టులో చేపలు పట్టుకునే అవకాసం కల్పించాలి.

 –          ఊరంతా మునిగితే మళ్లీ అన్ని సౌకర్యాలతో కూడిన (మంచినీరు, డ్రైనేజీ, బడి, గుడి, శ్మశానం వగైరా) కొత్త ఆవాసం ఏర్పాటు చేయాలి.

–          ఈ ప్రక్రియలో ప్రతి దశలోనూ ప్రజలకు అన్ని విషయాలు చెప్పి రాతపూర్వకంగా రికార్డులు నిర్వహించాలి. ప్రతిసారి గ్రామసభలు నిర్వహించి పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించాలి.

 –          భూమిలేని రైతు కూలీలకు, చేతివృత్తులవారికి ఒకేసారి నష్ట పరిహారం కింద రూ. 5 లక్షలు, పునరావాస భృతి కోసం రూ. 50 వేలు ఇవ్వాలి.

123 జీవో ప్రకారం:

–          ప్రజోపయోగార్థం ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల్లో ప్రజలను భాగస్వాములుగా చేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన భూ సేకరణ కోసం జిల్లా స్థాయి భూసేకరణ కమిటీలకు బాధ్యతలు అప్పగించింది.

–          2013 చట్టంలో పేర్కొన్నంత స్పష్టంగా భూమికి ఇంత భూమి లేదా ఇంత మొత్తం అని గానీ, అక్కడున్న మార్కెట్ ధర ప్రకారం ఇన్ని రెట్లు ఇస్తామన్న ప్రస్తావన గానీ జీవోలో పేర్కొనలేదు.

–          ప్రజలతో ఇష్టపూర్వకంగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే నష్టపరిహారం, పునరావసం కల్పించే బాధ్యతలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.

–          ఆసాములతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక హక్కులు, సవరణలకు అవకాశం లేదని స్పష్టంగా చెప్పారు.

               2013 చట్టం, 123 జీవోలను పరిశీలిస్తే 2013 భూసేకరణ చట్టం ఎంతో పకడ్బందీగా, నిరాశ్రయులకు మేలు చేసేదిగా ఉన్నమాట వాస్తవం. ఆ ప్రకారం చూస్తే 123 జీవోకు అసలు విలువే ఉండదు. పునరావాసం, పునరాశ్రయాలకు సంబంధించి జీవోలో ప్రభుత్వ హామీలే తప్ప భరోసా లేదు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోతే నిరాశ్రయులకు ఎక్కడా గ్యారంటీ లేదు. 123 జీవో ఇంత లోపభూయిష్టంగా ఉన్నా ప్రజలు తమ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించేందుకు ముందుకొస్తున్నారంటే వారిలో నమ్మకాన్ని కూడగట్టగలగడమే కీలకాంశం. తెలంగాణ సర్కారు ప్రాజెక్టులు చేపట్టింది ఎందుకు, ఉద్యమ లక్ష్యాలేంటి, దాని ఫలితాలు ఎవరికి అనే విషయంలో ప్రజల్లో చాలా మందికి స్పష్టత ఉంది. మల్లన్నసాగర్ కింద భూములు సేకరిస్తున్నది కార్పొరేట్ శక్తుల కోసం కాదని, లక్షలాది ఎకరాల బీడు భూముల్ని సాగు చేయడానికేనన్న విషయం ప్రజల్లోకి బాగా వెళ్లింది. అందుకే కేవలం ప్రజలకు నమ్మకం కల్పించి, 2013 చట్టం కన్నా తక్కువే అవుతున్నా వారిని మెప్పించి ఒప్పించడం ద్వారా సామూహిక రిజిస్ట్రేషన్ల వినూత్న ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేస్తోంది తెలంగాణ సర్కారు. తెలంగాణ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న సర్కారు.. విపక్షాల డిమాండ్ మేరకు 2013 చట్టం ప్రకారమైనా సరే ఇస్తాం అంటూనే… ఆ చట్టాన్ని గనక అమలు చేస్తే కేవలం చట్టానికే కట్టుబడతామని, అందుబాటులో ఉన్న రికార్డులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్న సంకేతాలు పంపడంతో విపక్షాల వ్యూహం బెడిసికొట్టింది. ప్రజల్లో పునరాలోచన కలిగింది. కోర్టుల చుట్టూ తిరిగి ఏళ్లు వృథా చేసుకునేకన్నా, తాము గెలిపించిన నేతలతో సఖ్యంగా ఉంటూ భవిష్యత్తులో కూడా ఆ సంబంధాలు నిలుపుకోవడం మంచిదన్న సానుకూల వైఖరి నిరాశ్రయుల్లో పెరిగింది. మరోవైపు అసలు 2013 భూ సేకరణ చట్టాన్ని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు ఎంత వ్యతిరేకించాయో ఓసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఎందుకంటే దాన్ని అమలు చేస్తూ నిరాశ్రయులను మెప్పిస్తూ ప్రాజెక్టులు కట్టడం ప్రాక్టికల్ గా అసంభవం. నిపుణుల ప్రైవేటు సంభాషణల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుండడం విశేషం. ఈ చట్టం అమల్లోకి వచ్చింతరువాత దేశంలో ఎలాంటి భారీ ప్రాజెక్టులు కూడా మొదలు కాలేదని, అందుక్కారణం చట్టంలోని సంక్లిష్టమైన నిబంధనలేనని అంతా అంటున్నదే. ఈ క్రమంలో తమ భూములు ఓ బృహత్ ప్రయోజనం కోసమేనని పల్లెపహాడ్ గ్రామస్తులు మంత్రి హరీశ్ రావు సమావేశంలో చెప్పడం గొప్ప విషయం. వారి త్యాగాలు యావత్ తెలంగాణ సమాజం చిరస్థాయిగా గుర్తుంచుకుంటుందని హరీశ్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కీర్తించడం భూములు కోల్పోతున్నవారిలో ఆత్మసంతృప్తిని ద్విగుణీకృతం చేస్తోంది. ఇంకా వారి కోరికేమిటంటే వారికి పునరావాసం అనేది కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోనే కల్పించి, ఆ కొత్త గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకునేలా చూడాలని కోరుతున్నారు. తెలంగాణ సర్కారు, ముఖ్యంగా కేసీఆర్ తమను మరచిపోరాదని, తమ జీవితాలు మళ్లీ కుదురుకునేదాకా దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూడాలన్న విజ్ఞాపనలు వ్యక్తమవుతుండడం విశేషం.
20160721_161908

ప్రతిపక్షాలు, జేఏసీ ఏం చేయాల్సి ఉండె?:

 సీపీఎం, కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఎలాగూ దూరదృష్టి లేదు. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిద్దామన్న పెద్దమనసు లేదు. ఇతర పార్టీలన్నీ ఖాళీ అవుతూ మిణుకుమిణుకుమంటున్న సందర్భాన్ని గుర్తించడం వల్లనే జేఏసీ అసలైన (ప్రతిపక్ష పాత్ర) ప్రజాపక్షంగా వ్యవహరిస్తుందని కోదండరాం గతంలో ప్రకటించారు. మల్లన్నసాగర్ విషయంలో జేఏసీ అలాంటి పాత్ర పోషించలేదన్న అపఖ్యాతి మూటగట్టుకుంది. ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలన్న సర్కారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, 2013 చట్టం చెబుతున్న నిబంధనల స్ఫూర్తితో ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పుడు దక్కుతున్న ఫలితాల కన్నా మరింత మెరుగైన సాయం అందించే అపురూపమైన అవకాశాన్ని జేఏసీ చేజేతులా జారవిడుచుకుంది.

1)      భూ సేకరణ విషయంలో ప్రజలందరి గొంతుకగా జేఏసీ వ్యవహరిస్తే బాగుండేది. ఇప్పుడు ప్రభుత్వం చేయిస్తున్న సామూహిక రిజిస్ట్రేషన్ల బాధ్యతను జేఏసీ తీసుకుని, మరింత పరిహారం కోసం డిమాండ్ చేస్తే నిరాశ్రయులకు మేలు జరిగేది.

2)      భూముల్లేని, ఇళ్లు మాత్రమే ఉన్న వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇంటితో పాటు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేయడానికి అంగీకరించింది. అయితే 2013 చట్టంలో పేర్కొన్నట్టు రూ. 5 లక్షలు కాకున్నా కనీసం మరో లక్షో, రెండు లక్షలైనా అలాంటి అందరి కోసం డిమాండ్ చేస్తే ఎందరో అభాగ్యుల జీవితాల్లో జేఏసీ వెలుగులు నింపినట్టయ్యేది.

3)      ప్రాజెక్టుతో లబ్ధి పొందనున్న ఆయకట్టు కింది భూముల ప్రజల్లో కూడా ఈ అవగాహన కలిగిస్తే జేఏసీ సామాజిక బాధ్యత నిర్వహించినట్టయ్యేది. ప్రాజెక్టు పూర్తయ్యాక దాని కింద పంటలు పండించుకుంటున్న రైతులు, ఇతర మార్గాల్లో లబ్ధి పొందుతున్న వర్గాల నుంచి నిరాశ్రయులైన కుటుంబాలకు చేయూత కోసం నాలుగైదేళ్ల పాటు ప్రత్యేకమైన సెస్సు వసూలు చేసేలా (ఉదా: టోల్ ట్యాక్స్ లాగా) జేఏసీ తీర్మానం చేస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త ఒరవడికి తెలంగాణ ప్రజలు శ్రీకారం చుట్టినవారై ఉండేవారు. అసలైన ప్రజాపాలన మల్లన్నసాగర్ నుంచే మొదలై ఉండేది. అలా వసూలు చేసిన ప్రత్యేకమైన సెస్సును ముంపు గ్రామాల ప్రజల కోసమే ఖర్చు చేసేలా సర్కారుకు దిశానిర్దేశం చేసి ఉండాల్సింది.

పైన చెప్పుకున్న పాత్రను జేఏసీ విస్మరించడం వల్ల ప్రజలకు జరగాల్సిన మరింత మేలు జరగకపోగా, రేపటి రోజుల్లో ఒకవేళ హామీలు నెరవేర్చని పక్షంలో ప్రభుత్వాన్ని నిలదీసే అద్భుతమైన అవకాశాన్ని జేఏసీ జారవిడుచుకున్నట్టయింది. ఎందుకంటే ప్రభుత్వం చొరవతోనే, అధికారుల సమక్షంలోనే నిరాశ్రయులంతా భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు, ఈ ప్రక్రియలో అసలు జేఏసీ పాత్రే లేకుండా పోవడం ప్రజలకు నష్టం కాక మరేమిటి? ప్రాజెక్టుకు ఎదురయ్యే ఇతరత్రా అడ్డంకులు తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తూ, ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటూ, ప్రభుత్వం చేత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాబట్టేలా వ్యవహరిస్తే అసలైన ప్రతిపక్ష బాధ్యత నిర్వహించినట్టయ్యేది. ఇక్కడ జేఏసీ విస్మరించిన మరో అంశం కూడా ఉంది. కరవుబారిన అల్లాడుతున్న గ్రామాలకు నీటి కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు కాబట్టి ఎప్పుడెప్పుడు తమ గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి నీళ్లు పారుతాయా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వామపక్ష మేధావులంతా కేవలం నిరాశ్రయుల పక్షాన మాత్రమే నిలబడడం అంటే నీళ్లులేని వందలాది గ్రామాల్ని విస్మరించినట్టు కాదా? వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల ఆందోళనలు మరింత ముదిరిన పక్షంలో నీరందాల్సిన వందలాది గ్రామాలు ఒక్కటై నీటికోసం నినదించి, సామూహికంగా రోడ్డెక్కితే అప్పుడు ప్రజల్లో అవాంఛనీయమైన చీలిక వచ్చేది కాదా? ఇలాంటి పరిస్థితులు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తాయో ఎందుకు ఊహించలేదు?

మెప్పించలేకపోయిన మేధావుల వాదన

మల్లన్నసాగర్ విషయంలో ఇర్రిగేషన్ నిపుణులు హ్రస్వదృష్టితోనే వ్యవహరించారు. ఇంజినీరింగ్ అనేది ఒక సృజనాత్మకమైన ప్రక్రియ. ఒక్కో ఇంజినీరు ఒక్కో రకమైన ఆలోచనను, అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు. పలువురి అభిప్రాయాలు విన్నాకే తాజా డిజైన్ ను ఆమోదించారు. సీపీఎం ఏర్పాటుచేసిన వేదికమీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన టి.హనుమంతరావు స్థిరమైన అభిప్రాయంతో కాక అడిగినవారి ఉద్దేశాల్ని బట్టి సూచనలు, సలహాలు ఇస్తాడన్న పేరుంది. మల్లన్నసాగర్ లో ఇంతపెద్ద ప్రాజెక్టు ఎందుకని, దాన్ని కుదించుకునే ప్రత్యామ్నాయాలు సూచించానని చెబుతున్న హనుమంతరావు.. అసలు ప్రాజెక్టు లేకుండానే అనుకున్న నీటిని పొందవచ్చని ఆఖరుకు తేల్చేశారు. ఆయన అభిప్రాయానికి సీపీఎం, కాంగ్రెస్, ఇతర మేధావులు వంతలుపాడారు. గోదావరిలో నీళ్లు పారుతున్న రోజుల్లో మాత్రమే వారి సూచన పనికొస్తుంది. నీళ్లు లేని సమయంలో నిల్వ ఉంచుకునే ఉద్దేశంతోనే కదా.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు చేపట్టింది? అంటే గోదావరి నీళ్లను తెలంగాణ సర్కారు నిల్వ ఉంచుకోరాదన్న దురుద్దేశమేదైనా ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిపుణులకు ప్రాంతీయ భేదాలు ఆపాదించడం సమంజం కాకున్నా.. హనుమంతరావు ఆంధ్రా వ్యక్తి కావడం, తెలంగాణను అడ్డుకున్న సీపీఎం ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగడం, ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం పాదయాత్ర చేయడం, ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వారు హైదరాబాద్ లో దీక్షలకు దిగడం వంటి అంశాలు అలాంటి అనుమానాలకు దోహదపడుతున్నాయి.

మల్లన్నసాగర్ గుణపాఠం కావాలి

మల్లన్నసాగర్ విషయంలో అప్రతిష్టపాలైన కాంగ్రెస్ (జేఏసీ కూడా) ఇకనైనా కళ్లు తెరవాలి. ప్రభుత్వం చేపడుతున్న ప్రతిపనినీ వ్యతిరేకించడం కాకుండా ప్రజలకు మేలు జరిగే కోణంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బాధ్యతగా వ్యవహరిస్తే పోయిన ప్రతిష్ట పొందడానికి ప్రయత్నించినవారవుతారు. 
Advertisements

One thought on “అడ్డంకులు అధిగమిస్తున్న మల్లన్నసాగరం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s