కాశ్మీర్ అంశం కొలిక్కి వస్తున్నదని భావిస్తున్న తరుణంలో అక్కడి పౌరుల మనోభావాలెలా ఉన్నాయనేది ఆసక్తి గొలిపే అంశం. దాన్ని బట్టే తాజా అఖిలపక్ష చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయనేది అంచనా వేయడానికి వీలవుతుంది. జులై 8న హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తరువాత నెలరోజులకు పైగా ఎడతెరిపి లేని అల్లర్లు, కర్ఫ్యూలోనూ రోడ్డెక్కిన కాశ్మీరీ యువకులు.. ఇలాంటివన్నీ చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. 15 ఏళ్ల వయసులోనే ప్రత్యేక కాశ్మీర్ ఉద్యమం కోసం బుర్హాన్ వనీ ఇల్లొదిలి వెళ్లిపోయాడంటే అక్కడి కొత్త రక్తంలో వేర్పాటు బీజాలు ఎంత బలంగా నాటుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. బుర్హాన్ తో పాటు అంతకుముందే ఓ కూతురిని, కొడుకును ఎన్ కౌంటర్లో కోల్పోయిన తండ్రి ముజఫర్ వనీ మనోభావాలు రగులుతున్న కాశ్మీర్ లోతుపాతులు తెలియజేస్తున్నాయి.
1స్క్రోల్ (డాట్) ఇన్ అనే న్యూస్ పోర్టల్ కు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ముజఫర్ వనీ తన  మనోభావాలు ఆవిష్కరించాడు. కాశ్మీర్ యువకుల్లో పెరుగుతున్న స్వేచ్ఛా కాంక్ష ఎంతబలంగా ఉందీ, తాజా చర్చలు ఎంతవరకు ఫలిస్తాయో అర్థం చేసుకునేందుకు ఆయన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలను విశ్లేషించుకోవడం మంచిది. తన కుమారుడు బుర్హాన్ వనీ పోలీసులకు చిక్కితే ప్రత్యేక కాశ్మీర్ ఉద్యమం పదేళ్లు వెనక్కి వెళ్లేదని, కానీ ఎన్ కౌంటర్లో చనిపోవడం వల్ల ఉద్యమం 20 ఏళ్లు ముందుకెళ్లినట్లయిందని సంతృప్తిని వ్యక్తం చేశాడు. స్వేచ్ఛా పోరాటంలో ప్రాణాలు వదిలిన కొడుకు తప్పకుండా స్వర్గ సుఖాలు అనుభవిస్తాడని గర్వంగా చెప్పుకుంటున్నాడు ముజఫర్. సెకండరీ పాఠశాలలో గణితం బోధించే ముజఫర్ మసీదులో ఖురాన్ కూడా బోధిస్తాడు. పూర్తి సంప్రదాయవాది అయిన ఆయన కాశ్మీర్ ను గురించి ఏమంటాడంటే..ఇది అల్లాకు నిలయమైన అందమైన భూమి. ఇక్కడ ఎవరూ బాధలు అనుభవించరాదు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. షరియా ప్రకారం మా పాలన మేం సాగించుకుంటాం. మా మీద ఎవరి పెత్తనమూ అక్కర్లేదు. అందుకే భారత్ నుంచి మేం వీలైనంత తొందరగా వేరు పడాలి. అది జరిగిన తరువాతనే మా పరిపాలన ఎలా ఉండాలో మేం నిర్ణయించుకుంటాం. అంతే కానీ.. మా పరిపాలనా విధానాలు నిర్ణయమైం తరువాత వేర్పాటుపై చర్చిస్తామనడం సరికాదు. మేం ఎలా ఉండాలో మాకు అర్థం అయ్యేందుకు రెండు, మూడు నెలలు, ఆరు నెలలు, కాదంటే ఏడాది పట్టొచ్చు. అయినా సరే. మేం స్వాతంత్ర్యం పొందిన తరువాత మాది మేం చూసుకుంటాం. మా కాలంలో మేం పోరాటాలకు భయపడేవాళ్లం. తుపాకి చూస్తే పారిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు పిల్లలు చిన్నతనం నుంచే తుపాకులతో ఆటాడుకుంటున్నారు. ప్రతిరోజూ వాటి శబ్దంతోనే మేల్కొంటున్నారు. అందుకే తుపాకులకు ఎదురీదుతూ భారత సైన్యం మీద రాళ్ల దాడులు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బలప్రయోగం ద్వారా ఉద్యమాన్ని అణచాలనుకుంటే అది అయ్యే పనేనా? అని అడుగుతున్నాడు.. ముజఫర్.
          కొడుకు చనిపోయిన దగ్గర్నుంచీ ముజఫర్ ఇంటికి రోజూ చాలా మంది యువకులు రావడం బుర్హాన్ ను అమరవీరుడిగా కీర్తిస్తూ నినాదాలు చేయడం, ర్యాలీలు తీయడం, నిరసనలు తెలపడం జరుగుతోంది. బుర్హాన్ పోయాక ఈ ఉద్యమానికి నేతృత్వం వహించాల్సిందిగా వారు తనను కోరుతున్నారని ముజఫర్ చెబుతున్నాడు. అయితే అది తన పని కాదని, ఇప్పుడు రాజకీయ నాయకులే దాన్ని చూసుకోవాలంటున్నాడు. ఇప్పుడున్న పీడీపీ ప్రభుత్వమైనా, అంతకు ముందున్న ఎన్సీ ప్రభుత్వమైనా ఎన్నికల్లో ప్రతిసారీ కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం హామీలు గుప్పిస్తున్నారని, అవి నెరవేర్చే సమయం ఇప్పుడు ఆసన్నమైందని ముజఫర్ కుండబద్దలు కొడుతున్నాడు. అంతేకాదు.. అఖిలపక్షం చర్చల్లో కాశ్మీర్లోని అన్ని వర్గాలు పాల్గొనాలని, వారితోపాటు పాకిస్తాన్ కూడా ఉండాలంటాడాయన. చర్చల్లో పాకిస్తాన్ ను భాగం చేయకుండా కాశ్మీర్ కు ఎలాంటి పరిష్కారం రాబోదని ఆయన గట్టిగా వాదిస్తాడు. స్థానిక ఎన్సీ, పీడీపీ పార్టీలతో పాటు హురియత్ నేతలు కూడా చర్చల్లో పాల్గొనాలనేది ఆయన డిమాండ్.
దీన్నిబట్టి కాశ్మీర్ సమస్యకు పరిష్కారం పాకిస్తాన్ ను ఒప్పించడం లేదా, తప్పించడం మీద ఆధారపడి మాత్రమే ఉందనేది స్పష్టమవుతోంది. పాక్ అండ లేకుండా కాశ్మీరీ ముస్లిం యువకులు ఇంత సుదీర్ఘకాలం ఉద్యమం నడపడం అసంభవం. అటు పాక్ పాలకులు కూడా కాశ్మీర్ పాక్ లో విలీనమయ్యే రోజులు సమీపించాయంటుండగా.. అది కలలోని మాటగా భారత్ అంతే దృఢంగా తిప్పికొడుతోంది. అంతర్గత అలజడులతో, వారినికో భీకరమైన దాడి చొప్పున ఉగ్రవాదులు పాక్ భూమ్మీదనే పెట్రేగుతుంటే దాన్నుంచి బయటపడటం చేతకాని పాక్ పాలకులు… కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం ఎందుకు ఆరాటపడుతున్నారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే కాశ్మీర్లోని చాలా భూభాగాన్ని అదుపులో పెట్టుకున్న పాక్ (పీఓకే) ఇకపై కాశ్మీర్ ను పూర్తిగా చేతుల్లోకి తీసుకొని భారత్ కు మరిన్ని సమస్యలు సృష్టించాలని భావిస్తోంది. కాశ్మీర్ విడిపోయే దాకా భారత్ తో చర్చల ద్వారానో, చొరబాట్లను ప్రోత్సహించడం ద్వారానో కీలకంగా వ్యవహరించాలుకుంటున్న పాక్.. ఆ సమస్యకు పరిష్కారం దొరికిన తరువాత కాశ్మీర్ అండతో భారత్ ను టార్గెట్ చేసే ప్రమాదముంది. ఎందుకంటే.. పూర్తి స్వాతంత్ర్యం కావాలంటున్న కాశ్మీరీ వేర్పాటువాదులు కనీసం భారత్, పాక్ లకు సమానదూరం పాటించాలని అనుకోవడం లేదు. పాక్ అండతోనే అల్లర్లకు తెగబడుతున్నారు. కాబట్టి ఇక్కడ పాక్ తో కలిపి కాశ్మీర్ వేర్పాటును కోరుకునే అందరిదీ ఒకే డిమాండ్ గా కనిపిస్తుండగా.. ఇండియా మాత్రం సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకుంటూనే సామరస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో బీజేపీతో అధికారం పంచుకుంటున్న పీడీపీ (సీఎం మెహబూబా ముఫ్తీ) మరింత క్రియాశీలంగా, చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉంటుంది. కాశ్మీరీ ముస్లింలలో భారత్ మీద నమ్మకం పెంచి హురియత్ ను నిదానంగా దారికి తెచ్చుకోవడంతో పాటు, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద  సంస్థలకు అండగా నిలుస్తున్న పాక్ ప్రమేయాన్ని తగ్గించాలి. ముస్లింలలో పసిపిల్లల దగ్గర్నుంచి ప్రత్యేక కాశ్మీర్ ను కోరుకుంటున్నప్పుడు ఇదంత సులభ సాధ్యమైన పనిగా కనిపించడం లేదు. కాశ్మీర్ కు బయటి నుంచి అన్ని రకాల దారులూ మూసేసి, అసలైన రక్షకులు భారత పాలకులేనని మనసా, వాచా, కర్మణా కాశ్మీరీలకు నమ్మకం కలిగించాలి. ఆ దిశగా అడుగులు పడినప్పుడే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దగ్గరవుతుంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s