భారత ఉపఖండం కింద భూమి పొరలు ప్రమాదకరంగా కదులుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపానికి దారితీసే సంకేతాలు కనిపిస్తున్నాయని జియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ అధ్యయనాల ఫలితంగా వారీ నిర్ధారణకు వచ్చారు. ఉపఖండం ఈశాన్య భాగంలోని
సుమారు 140 మిలియన్ల ప్రజలు ఒక ఊబి లాంటి అందమైన పొర మీద ప్రమాదకరంగా జీవిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
                 కొలంబియా యూనివర్సిటీకి చెందిన మైకేల్ స్టెక్లర్ అనే జియాలజిస్టు నేతృత్వంలోని కొందరు శాస్త్రవేత్తల బృందం2003 నుంచి 2014 వరకు ప్రత్యేకంగా బంగ్లాదేశ్ జోన్ మీద అధ్యయనం చేశారు. భారత ఉపఖండంలోని భూ కదలికలను అర్థం చేసుకునేందుకు బంగ్లాదేశ్ ను యూనిట్ గా తీసుకొని అధ్యయనం మొదలుపెట్టారు. అందుకోసం బంగ్లాదేశ్ అంతటా గుర్తించిన పలు ప్రదేశాల్లో 26 జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ లను ఏర్పాటు చేశారు. అలా బంగ్లాదేశ్ అడుగున దక్షిణ భూభాగంలో కదలికలను గమనించడం ద్వారా భారత ఉపఖండం కదలికలను అంచనా వేయగలిగారు. వారి అధ్యయనాలు భారత్, మయన్మార్, మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రజలకు పెనుప్రమాదం పొంచి ఉందని తేటతెల్లం చేస్తున్నాయి. వారి పరిశోధనలు నిజమైతే 2011లో జపాన్లో సంభవించిన భారీ భూకంపం (రిక్టర్ స్కేలుపై 9.0) లాంటి ఉపద్రవం సంభవించే అవకాశం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపంగా నమోదు కావచ్చు.
            indian plate   400 ఏళ్ల క్రితం నుంచే భూమి పొరల్లో ఒత్తిళ్లు సంభవిస్తున్నట్లు జియాలజిస్టులు గుర్తించారు. అంటే మన దేశంలో మొఘలులు పాలిస్తున్న కాలంలో (క్రీ.శ. 1600 ప్రాంతం)నే ఈ సర్దుబాట్లు ప్రారంభమయ్యాయన్నమాట. భారత ఉపఖండ భాగం ఆసియా భూభాగంతో చాలా చురుగ్గా ఢీకొంటోంది. అంటే తూర్పు, ఈశాన్య ప్రాంతంలోని దాదాపు 200 కి.మీ. మేర భూమి పొరలు (టెక్టానిక్ ప్లేటు) స్ప్రింగుల్లాగా ఒత్తిళ్లకు గురవుతూ ఒరుసుకుంటూ సర్దుబాటు అవుతూ వస్తున్నాయి. ఈ ఒత్తిడి గనక ఒక్కసారిగా అదుపు తప్పితే.. పూర్తి ఏమరుపాటుగా ఉన్న ప్రాంతం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆ ఒత్తిడి అదుపు తప్పడం అనేది ఎప్పుడు జరుగుతుందో చెప్పడం కష్టమంటున్నారు భూకంప నిపుణులు. ఈ ప్రాంతమంతా ఒక్క భూకంపానికే గురవుతుందా లేక వరుస భూకంపాలు సంభవిస్తాయా అన్నది చెప్పలేమని వినీత్ గెహ్లట్ అనే జియాలజిస్టు చెబుతున్నారు.
                     ఈ అధ్యయనంలో తేలిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 40 మిలియన్ల సంవత్సరాలుగా భూరత ఉపఖండం టెక్టానిక్ ప్లేటు ఆసియా ఖండం టెక్టానిక్ ప్లేటులోకి చొచ్చుకుపోతూ వస్తోంది. అంటే హిమాలయాలు ఉన్న భూభాగంలోకి మరింతగా చొచ్చుకుపోతోందన్నమాట. భూగర్భంలో చోటు చేసుకునే ఈ సర్దుబాట్లవల్లనే ఎత్తయిన పర్వతాలు, లోయలు వంటివి ఏర్పడతాయని జియాలజిస్టులు చెబుతూ వస్తున్నారు. ఇందువల్లనే హిమాలయాలు తీవ్రమైన క్రమక్షయానికి గురవుతున్నాయని, ఆ శిథిలాలన్నీ గంగా, బ్రహ్మపుత్రా నదుల్లోకి చేరి బంగాళాఖాతంలోకి ఏటా బిలియన్ టన్నుల దాకా చేరిపోతోందట. అలా కొట్టుకు వచ్చిన శిథిలాల కారణంగానే బంగ్లాదేశ్ వద్ద ఖండపు అంచులు దాదాపు 400 కి.మీ. దాకా పెరిగినట్లు ధ్రువీకరించారు. నదుల ద్వారా కొట్టుకొచ్చి మేట వేసి  డెల్టాలుగా ఏర్పడ్డ ప్రాంతం సారవంతమైన ప్రాంతంగా ఉంది. ఢాకా చుట్టూ ఈ సారవంతమైన భూముల్లో 14 మిలియన్ల మంది ప్రజలున్నారు. ఈ సెడిమెంట్ల వల్ల భూకంప తీవ్రత చాలారెట్లు పెరుగుతుందని చెబుతున్నారు.
                             వెలుగుచూసిన కొత్త సంగతులు
                       బంగ్లాదేశ్ జీపీఎస్ ల ద్వారా వచ్చిన సమాచారాన్ని, ఈశాన్య భారత్, మయన్మార్ జోన్లలో అంతకుముందే చేసిన పరిశోధనలతో పోల్చి చూశారు. మయన్మార్ ప్లేట్ నైరుతి దిశగా కదులుతున్నట్టు గుర్తించారు. ఈ కదలిక భారత ఉపఖండానికి అనుగుణంగా ప్రతియేటా 51 మిల్లీ మీటర్లు (సుమారు 2 ఇంచులు) మేర కదులుతోంది. చాలా సంక్లిష్టమైన ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలకు మరో సంగతి తెలిసొచ్చింది. ఈశాన్య భారత్, బంగ్లాదేశ్ జోన్ లో కదలికల్ని మదింపు వేస్తున్న క్రమంలో.. భారత ఉపఖండం కిందనున్న టెక్టానిక్ ప్లేట్ చాలా చురుగ్గా యూరేషియా ప్లేట్ కిందికి జారుకుంటోందని గుర్తించారు. దాని వేగం ఏటా 0.51 నుంచి 0.67 ఇంచుల దాకా (13 నుంచి 17 మిల్లీ మీటర్లు) ఉంటోందని నిర్ధారించారు. మరో విషయమేంటంటే ఇండియన్ ప్లేట్ మయన్మార్ వాయవ్య దిశగా ఉన్న పర్వతాల అడుగు భాగంలోని పొరల్లో ఇరుక్కొని పోయిందని (లాక్ అయిందని) తేల్చారు. అందువల్లే యూరేషియా ప్లేట్ కిందికి దిశ మార్చుకుందేమోనని అనుమానిస్తున్నారు. భూమి అడుగు పొరల్లో ఎలాస్టిక్ ఎనర్జీ (స్థితిస్థాపక శక్తి) క్రమంగా పుంజుకుంటోందని, ఈ పరిణామం ఉపఖండంలోని ప్రజలకు చాలా ప్రమాదకరమని ఢాకా యూనివర్సిటీలోని సిస్మాలజిస్టు సయ్యద్ హుమాయూన్ అఖ్తర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఢాకాలో ఇళ్లు, కట్టడాల నిర్మాణాల్లో నిబంధనలు ఎప్పుడో గాలికొదిలేశారు. భూకంపాలు ఏర్పడ్డప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించలేదు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా లేవు. ఇదే ఇప్పుడు బంగ్లాదేశ్ ను భయపెడుతోంది. 2015లో నేపాల్లో 7.8 పాయింట్ల భూకంపం సంభవించినప్పుడు భవనాలు ఒరిగిపోవడంతో ఆ భయానికి చాలా మంది గుండెలు ఆగిపోయి మరణించారు. జనంలో ఏర్పడ్డ తొక్కిసలాట వల్ల మరింత మంది రాలిపోయారు. అవి గుర్తు చేసుకుంటే రానున్న ప్రమాదం ఎలా ఉంటుందోనన్న ఆందోళన పీడిస్తోంది.
                      ఈ అధ్యయనంలో తేలిన ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని అధ్యయనాలు జరిపి, పరిష్కారాల కోసం అన్వేషణ మొదలు కావచ్చు. కొండలు, లోయలతో ఉన్న ప్రాంతం సహజంగానే భూకంపాలకు ఎక్కువ అవకాశం కలిగి ఉంటుంది. కానీ.. భౌగోళికంగా మిశ్రమ లక్షణాలున్న ఉపఖండ భూభాగంలో భూకంపాలు ఏర్పడే సంభావ్యత ఎందుకుంది?మిలియన్ల సంవత్సరాల కింద భోగళంలో చోటు చేసుకున్న పరిణామాలే అందుకు కారణమా? అనే కోణాల్లో అధ్యయనం చేసే వీలు ఏర్పడింది.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s